BJP Raithu Deeksha in Telangana : రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శించారు. ఆరుగాలం శ్రమించిన కర్షకులను ఆర్థికంగా ఆదుకోవాలంటూ సత్యాగ్రహ దీక్ష పేరుతో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డిలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఓబీసీ మొర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Govt) విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రేవంత్ సర్కార్ సైతం రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు.
అన్నదాతల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయం చేయడం తప్ప, రైతులకు అండగా నిలబడటంలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద జరిగిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆమె, రుణమాఫీ, కౌలుదారులకు రైతుబంధు, వరికి రూ.500 బోనస్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కర్షకుల హామీలను తక్షణమే నెరవేర్చాలి - రైతుదీక్షలో బండి సంజయ్ డిమాండ్ - Bandi Sanjay raithu Diksha
"రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరిట రైతులను మోసం చేయలేదా చెప్పాలి. ఇప్పుడు వరకు మీరు రైతాంగానికి రూ.500 బోనస్ చెల్లించలేకపోతున్నారో, ఎందుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలేదో చెప్పాలని నేను ప్రశ్నిస్తున్నాను. హామీలు ప్రకటించిన రేవంత్ రెడ్డి, రైతాంగానికి ఇవాళ మీరు మొహం ఎందుకు చాటేస్తున్నారో తెలపాలి." -డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
BJP Raithu Satyagraha Deeksha : పంట నష్టపోయిన రైతులను పొలాల్లోకి అధికారులు గానీ, మంత్రులు గానీ చూసిన పాపాన పోలేదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రేవంత్ సర్కార్ కర్షక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆక్షేపించారు. నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
మఖ్యమంత్రి రేవంత్ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు కండువాలు కప్పడంలో ఉన్న దృష్టి రైతులను ఆదుకోవడంలో చూపడం లేదన్నారు. సీఎం చెప్పినట్లు కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరిచి ఎండుతున్న పంటలకు సాగునీరు అందించాలని హనుమకొండలో ఆ పార్టీ నాయకురాలు రావు పద్మ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నిరసనలో పాల్గొన్న ఎంపీ అర్వింద్(BJP MP Arvind) రైతులకి ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. అన్నదాతలను విస్మరిస్తే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని జోస్యం చెప్పారు.
"75 ఏళ్లనుంచి మీరే రైతులను నాశనం చేస్తున్నారు. పసుపు ధరలు ఇవాళ రూ.20 వేలు ఉన్నాయంటే ఎగుమతి, దిగుమతి విధానం సరిచేసినందుకే అవి మద్దతు ధరలు పలుకుతున్నాయి. అవి మీరు చక్కగా చేయకనే కర్షకులు ఇన్నాళ్లు నష్టపోయారు. ఎగుమతి, దిగుమతి విధానం ఉండటం వల్లే ఇవాళ భారత్ ఎకానమీ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుంది."-అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
BJP Poru Deeksha in Telangana : భువనగిరిలో చేపట్టిన దీక్షలో కమలం పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. రాష్ట్రంలో వచ్చింది ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన కరువు కాదని, కృత్రిమ కరవు అని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌రావు అన్నారు. నల్గొండ గడియారం చౌరస్తాలో రైతు సత్యాగ్రహ దీక్షలో సైదిరెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన నాగార్జనసాగర్‌లో నీళ్లు ఉన్నా పంటలను రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం చొరవచూపడం లేదని ఆరోపించారు.