JP Nadda Election Campaign In Choutuppal : ఎన్డీఏ సర్కారు కృషి వల్లే, దేశంలో 25 కోట్ల మంది పేదల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్‌లో జరిగిన సభలకు హాజరైన ఆయన, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
BJP Chief JP Nadda Comments on Congress : మొదటి నుంచి రిజర్వేషన్లకు హస్తం పార్టీ వ్యతిరేకమన్న నడ్డా, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని పదేపదే అంటున్నారని మండిపడ్డారు. అదే విధంగా మోదీ సర్కార్ రిజర్వేషన్లను తొలగించదని స్పష్టం చేశారు. ప్రధాని అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నట్లు వివరించిన ఆయన, తెలంగాణలోనూ 2 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు.
"ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ రెండూ నిరుపయోగమైనవే. ఆ రెండు కుటుంబ, అవినీతి పార్టీలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి గులాబీ పార్టీ పాల్పడితే, దేశవ్యాప్తంగా గతంలో హస్తం పార్టీ చేయని స్కాం లేదు. వీళ్లంతా స్కీమ్స్ పెట్టింది స్కామ్స్ కోసమే."-జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా క్లిష్ట సమయాన్ని మోదీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని నడ్డా పునరుద్ఘాటించారు. మోదీ నాయకత్వంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఎదిగిందన్న ఆయన, వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలోనూ భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని తెలిపారు. పదేళ్ల క్రితం మన ఫోన్లపై మేడిన్ చైనా, మేడిన్ కొరియా అని ఉండేదని, ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్లపై మేడిన్ భారత్ అని ఉంటోందన్నారు.
JP Nadda Public Meeting in Nalgonda : మరోవైపు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించిన జేపీ నడ్డా, ఒకే దేశం- ఒకే రాజ్యాంగం ఉండాలనేది మోదీ ప్రభుత్వ విధానమని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో జమ్ముకశ్మీర్‌కు 70 ఏళ్లపాటు ప్రత్యేక రాజ్యాంగం ఉందని విమర్శించారు. పాకిస్థాన్ విషయంలో మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, అటువంటి ఆలోచనలు హస్తం ఎన్నడూ తీసుకోలేదని దుయ్యబట్టారు. మోదీ హయాంలో హైవేలు, రైల్వే లైన్ల విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించారు.
మోదీ హయాంలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి : జేపీ నడ్డా - JP Nadda Election Campaign
మోదీ గుండెలో బండి సంజయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది : అన్నామలై - Annamalai election campaign