JP Nadda Election Campaign In Kothagudem : మోదీ నేతృత్వంలో భారత్ ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదుగుతోందని, పది సంవత్సరాల మోదీ పాలనలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరిగిందని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం, మానుకోటలో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈసందర్బంగా మాట్లాడుతూ మరో రెండేళ్లలో మనదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణకు కేంద్రం పదేళ్లుగా అన్ని రకాలుగా సాయం చేసిందని, తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగిందని జేపీ నడ్డా పేర్కొన్నారు. మనదేశంలో తయారైన ఔషధాలు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయని వివరించారు. ఒకప్పుడు ఫోన్లన్నీ మేడిన్ చైనా, కొరియా, జపాన్వి ఉండేవని ఇప్పుడు మేకిన్ ఇండియా పేరుతో ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తున్నామని వెల్లడించారు. సికింద్రాబాద్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించామని, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
Bjp Election Campaign In Telangana : దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని మరో ఐదేళ్లు కొనసాగిస్తామని జేపీ నడ్డా స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లలో 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చామని మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మోదీ ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించే ఆలోచిస్తారని వివరించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి చికిత్స అందిస్తామన్నారు. భవిష్యత్తులో పైపులైను ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని తెలిపారు.
సీఏఏను మతంతో ముడిపెట్టి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది : ఎంపీ లక్ష్మణ్ - LAXMAN MEET WITH MEDIA
"ఎస్టీల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కృషి చేసింది. గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గిరిజన రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి అండగా ఉన్నాం.మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉంది. మనదేశ ఆర్థిక వ్యవస్థను మోదీ 11 నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చారు.రెండేళ్లలో మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. మా పాలనలో 25 కోట్లమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు." -జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం సాకారం : విపరీతమైన ఎండలో కూడా ప్రజలు తమ మీద ప్రేమతో మా సభకు తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్‌రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోదీ సాకారం చేశారని సీతారాం నాయక్, వినోద్‌రావును గెలిపించి దిల్లీకి పంపాలని ప్రజలను కోరారు. తమ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలహీనమైనదని కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతి చేశారని విమర్శించారు.