BJP MLA Alleti Maheshwar Reddy Comments on Congress Govt in Telangana : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోను డమ్మి బుక్‌గా మార్చుకుందని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఏలేటీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఓటమి భయంతో సర్పంచ్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలు లేకపోతే కేంద్రం నుంచి నిధులు రావని తెలిసిన ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలల నుంచి జీతాలు రావడం లేదని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె బాట కార్యక్రమానికి వెళ్లాలన్నారు.
ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతిని నడుపుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివరించారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు, మంత్రుల కంపెనీలకు ఇవ్వడానికి నిధులు ఉంటాయి తప్పితే పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వడానికి చేతులు రావని దుయ్యబట్టారు. ఎంబీ రికార్డు అయిన రూ.1200 కోట్ల సర్పంచ్ల బిల్లులు ఇంతవరకు రాలేదన్నారు. సర్పంచ్‌లు పని చేశాక నిధులు ఎందుకు ఆపుతారని ప్రశ్నించారు.
అలాగే మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చే రూ.2000 పింఛన్లు కూడా ఆలస్యంగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్థిక పరిస్థితుల మీద ఎమర్జెన్సీ పెట్టాలన్నారు. నిధులు లేక గ్రామ పంచాయతీలు విలవిలలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని చెప్పడం కాదు, పల్లె బాట పట్టాలని హితవు పలికారు.
"బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. పంచాయతీ కార్యదర్శులు జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టుకుని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. బీ ట్యాక్స్ ఇస్తాలేరని సర్పంచ్ల బిల్లులు ఆపుతున్నారా?. గ్రామాల అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సమస్యలను పరిష్కరించాలి. ఎప్పటిలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఇద్దరు సీఎంల భేటీలో తెలంగాణకు చిన్న నష్టం జరిగినా ఊరుకునేది లేదు. తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు. స్పీకర్‌కు పంపించిన రిజిస్టర్ పోస్టులు తిరిగివస్తున్నాయి. అసెంబ్లీ అడ్రస్ తప్పా లేక కావాలనే తిప్పిపంపుతున్నారా. స్పీకర్ తప్పించుకుని తిరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దొరుకుతారు." అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు.