Alleti Maheshwar Reddy on MLAs Disqualification Case : రాష్ట్ర హైకోర్టు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంప పెట్టు లాంటిదన్నారు. హైకోర్టు తీర్పును మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించడాన్ని అభినందిస్తున్నానన్న ఏలేటి, పొన్నం ప్రభాకర్ స్వాగతించడం కాదు ముఖ్యమంత్రి, ఖర్గే హైకోర్టు తీర్పును అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరితే చావు డప్పు కొట్టాలన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు పాల్పడటం బాధాకరం అన్నారు.
ముగ్గురే కాదు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ కట్టబెట్టడాన్ని తప్పుపట్టారు. పీఏసీ ఛైర్మన్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే పీఏసీ ఛైర్మన్ ఇవ్వడమంటే న్యాయ స్థానాలను అగౌరవ పర్చడమేనని మండిపడ్డారు. ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏఐసీసీకి రాష్ట్ర కాంగ్రెస్‌కు మధ్య గ్యాప్ ఏర్పడిందా అని ప్రశ్నించారు. ఇందిరా కాంగ్రెస్ ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ అని చెప్పదల్చుకున్నారా ప్రశ్నించారు.
హైడ్రా ఆరంభ శూరత్వం అయ్యింది : ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొనేటప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పా సీనియర్ నేతలు ఎవ్వరూ లేరని ఏలేటి తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికి కాకుండా మహేశ్వర్ కుమార్ గౌడ్‌కు పీసీసీ పదవి కట్టబెట్టారన్నారు. రాష్ట్ర మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. ఓవైసీ, ముఖ్యమంత్రి సోదరుడి బిల్డింగ్‌లను కూల్చలేక హైడ్రా కోరలు పికేస్తున్నారని దుయ్యబట్టారు. హైడ్రా ఆరంభ శూరత్వం అయ్యిందని ఎద్దేవా చేశారు.
'మీరు నిజంగా ఏఐసీసీ పరిధిలో ఉన్నారా? ఏఐసీసీ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా తెలంగాణలో ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ అని చెప్పదల్చుకున్నారా? హైకోర్టు ఒకవైపు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలిస్తే, మరోవైపు పూర్తిగా విరుద్ధంగా పీఏసీ ఛైర్మన్ నియామకాలు చేపట్టారు. మొత్తం పది ఎమ్మల్యేలపై పార్టీ ఫిరాయింపు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది'- ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత