BJP Bandi Sanjay Fires on Congress And BRS Parties : పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతి బయటపడాలని, కాళేశ్వరం లాగా విచారణ మిగిలిపోవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. రైసు మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. కాళేశ్వరం విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని మండిపడ్డారు.
Bandi Sanjay On Civil Supplies Scam In Telangana : పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్న బండి సంజయ్ ఎస్ఎల్బీసీ పేరుతో కాంగ్రెస్ నేతలు, డిండి పేరుతో బీఆరఎస్ నేతలు మోసం చేశారన్నారు. 590 టీఎంసీలు రావాల్సి ఉంటే కేసీఆర్ 290 టీఎంసీలకే ఒప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోందని బండి సంజయ్ అన్నారు.
"బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలకు పాల్పడి వేల కోట్లు దోచుకుందో కాంగ్రెస్ పార్టీ కూడా వేల కోట్లు దోచుకుంటూ దిల్లీకి పంపుతోంది. రాష్ట్రంలో జరిగిన నష్టాలపై విచారణ జరగాలి. దానికి కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. కాళేశ్వరం స్కామ్ తర్వాత పెద్దస్కామ్ అంటే పౌరసరఫరా శాఖలో జరిగింది. విచారణ అంటారు కానీ ఏమీ చేయరు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అరెస్టులు చేస్తామని చెప్పారు కానీ ఎందుకు చేయడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫర శాఖలో జరిగిన కుంభకోణాలను బయటపెట్టాలి. లేదంటే మీరు విమర్శలకు గురవుతారు." - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం : బీజేపీ పోరాటాల ఫలితంగానే కేసీఆర్ గద్దె దిగారని బండి సంజయ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మద్దతుగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ మాత్రమే కొట్లాడిందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. పట్టభద్రులు ఆలోచించి బీజేపీ అభ్యర్థిని మండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల కోసం పోరాడింది బీజేపీ నేతలే : రాష్ట్ర ప్రజల సమస్యల కోసం బీజేపీ పోరాడితే, అమలుకాని హమీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుందని చెప్పారు. ఏ మతానికి తాను వ్యతిరేకం కాదన్న ఆయన హిందూ ధర్మాన్ని ఎదిరిస్తే ఊరుకోమన్నారు. అయోధ్య రామయ్య అక్షింతలను కాంగ్రెస్ హేళన చేసిందని గుర్తుచేశారు. స్కాలర్షిప్లురాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యార్థుల కోసం రూ.11వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుందని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో మరోసారి మోదీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.