BJLP Leader Alleti Maheshwar on Dharani Issue : ధరణి పోర్టల్ పేరుతో లబ్ధి పొందిన గులాబీ నేతలెవరో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. లక్షల ఎకరాలు మాయమైతే, కారకులు ఎవరు? ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు.
సభకు చెప్పకుండా అంతరాత్మలకు తెలుసునని కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పుకోవడం సరైంది కాదని హితవు పలికారు. రూ.2 లక్షల కోట్ల రూపాయలు ధరణి పోర్టల్ పేరుతో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ కేసును ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదని నిలదీశారు.
"రాష్ట్రంలో అవకతవకల, అక్రమాల ధరణి పోర్టల్‌ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దిద్దుబాటు చేస్తుందని నాడు పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణి పోర్టల్ పేరుతో లాభం పొందిన గులాబి నేతలెవరో ఇప్పుడు మరి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు బయట పెట్టలేదు. లక్షల ఎకరాలు మాయమైతే కారకులు ఎవరు? మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. సభకు చెప్పకుండా అంతరాత్మలకు తెలుసనని కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పుకోవడం సరికాదు." -ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షనేత
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న మతలబు ఏంటో : రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ఏలేటి ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కార్ అన్యాక్రాంతం చేసిన భూముల మీద శ్వేతపత్రం ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. ధరణి పోర్టల్‌ను విదేశీ కంపెనీకి అప్పగించిన కేసీఆర్, కేటీఆర్ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న మతలబు ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ అడిట్ ఎప్పటి వరకు చేస్తారో స్పష్టం చేయాలని కోరారు.
CPI MLA Kunamneni on Dharani Portal : రాష్ట్రంలో ధరణి ప్రవేశపెట్టిన తర్వాత గ్రామాల్లో అప్రకటిత అల్లకల్లోలం నెలకొందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కేసీఆర్ ధరణి పేరుతో మంచి చేయాలనుకుంటే బూమ్రాంగ్ అయ్యిందన్నారు. రాష్ట్రంలో సర్వే నెంబర్లు సక్రమంగా ఉండవని, అంతా సాదా బైనామాలేనన్నారు. స్పాట్ బుక్ చేస్తే చాలు ఒకేసారి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని అమాయకుల భూములను పెద్ద వాళ్లు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ధరణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.