Bhatti Vikramarka Reaction on BRS MLAs Meeting CM Revanth Reddy : రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను కలవడంలో ఇతర అంశాలేమీ లేవన్నారు. బీఆర్ఎస్ సర్కార్ మాదిరి సంస్కృతి కాంగ్రెస్‌లో లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా హస్తం పార్టీ అందరినీ గౌరవిస్తుందని వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Secunderabad Parliament Election Booth Committee Meeting : ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని పునరుద్ఘాటించారు. మంచినీళ్లు, విమానాశ్రయం, ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి ప్రారంభించింది హస్తం పార్టీయే అని తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావులు తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. బూత్ కమిటీ అధ్యక్షులను నియమించుకుని, పక్కా ప్రణాళిక ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అనిల్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సంపద సృష్టించే వారిని ఎప్పుడూ గాయపరచం : భట్టి విక్రమార్క
బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో ఇతర అంశాలేమీ లేవు. బీఆర్ఎస్ సర్కార్ మాదిరి సంస్కృతి కాంగ్రెస్‌లో లేదు. మాది ప్రజా ప్రభుత్వం. మా పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను ఎలాగైతే స్వేచ్ఛగా కలుస్తారో, ఇతర పార్టీ శాసనసభ్యులూ అలాగే కలవొచ్చు. ఆ స్వేచ్ఛ అందిరికీ ఉంటుంది. - భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
సీఎం రేవంత్‌ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - అసలేం జరుగుతోంది?
అసలు ఏం జరిగిందంటే? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గమైన రాజేంద్రనగర్‌లోని శంషాబాద్ మండలం కొత్వల్గూడా, బహదూర్ గూడా, ఘన్సిమియాగూడా గ్రామాల్లో గల భూ సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలిసినట్లు ప్రకాశ్ గౌడ్ తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల రేవంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే.