Bandi Sanjay Comments on Congress : బీజేపీ కెప్టెన్, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ అని, మరి కాంగ్రెస్‌కు కెప్టెన్, ప్రధాని అభ్యర్థి ఎవరని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
నేడు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న నిధులు, సంక్షేమ పథకాలే కారణమని బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు ఒక్క పైసా కూాడా ఇవ్వలేదని, కేంద్ర నిధులను పక్కదారి మళ్లించిందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు రాజకీయాలతో ముడిపడినవి కాదని, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మోదీనే మళ్లీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Bandi Sanjay on KCR and KTR : అంబేడ్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే, తాను కొట్లాడినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. దీనిపై ఏ కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించలేదన్నారు. ఇవాళ కేసీఆర్, కేటీఆర్ బజారులో పడ్డారంటే దానికి కారణం తన పోరాటమేనని ఆయన తెలిపారు. అందుకే తన మీద 109 కేసులు ఉన్నాయన్నారు. భారత రాష్ట్ర సమితి అంటే దేశం అంతా పోటీ చెయ్యాలని, కానీ ఇక్కడే వాళ్లకు అభ్యర్థి లేడని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సర్పంచులను బిచ్చగాళ్లను చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిందని దుయ్యబట్టారు. దేశాన్ని 57 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.1,100 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.59,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో 8 మంది ఎస్టీ, 12 మంది ఎస్సీ, 20 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ మంత్రులు ఎంత మంది ఉన్నారని ఆయన ప్రశ్నించారు. గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడానికి వీలు లేదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్కటై అడ్డుకునే ప్రయత్నం చేశాయని ధ్వజమెత్తారు. ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపాయికారీ ఒప్పందం చేసుకొని తనను కరీంనగర్‌లో ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
"నేడు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కేంద్రం ఇస్తున్న నిధులతోనే ముందుకు సాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సర్పంచ్‌లను నట్టేట ముంచింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు డబుల్ గేమ్ ఆడుతున్నాయి". - బండి సంజయ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి