Bandi Sanjay Election Campaign In Karimnagar : దేశంలో ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ నడుస్తోందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఎన్డీఏ టీంకు మోదీ కెప్టెన్, మరి కాంగ్రెస్ కూటమికి కెప్టెన్ ఎవరో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఉదయపు నడకకు వచ్చిన ప్రజలను కలిసి ఆయన ఓట్లు అభ్యర్థించారు. స్థానికులతో కలిసి సరదాగా క్రికెట్, వాలీబాల్ ఆడారు.
ఈ ఎన్నికలు గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య జరుగుతున్న పోటీ అని, ఎటువైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటేయాలని బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటమి ఖాయమైందన్న ఆయన, అందుకే ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఒక్కటై తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
Bandi Sanjay Comments On Congress : గతంలో కరీంనగర్ అభివృద్ది కోసం రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చానని తెలిపారు. స్వయంగా ప్రధాని చేతుల మీదుగా జాతీయ రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా మోదీ సహకారంతో రూ.వేల కోట్లను తీసుకొచ్చినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటమి ఖాయమైందని అన్నారు. అందుకే కరీంనగర్లో పోటీచేస్తన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఒక్కటై తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు.
దేశంలో ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ నడుస్తోంది. ఎన్డీఏ టీంకు మోదీ కెప్టెన్ మరి కాంగ్రెస్ కూటమికి కెప్టెన్ ఎవరు. ఈ ఎన్నికలు గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య జరుగుతున్న పోటీ. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటమి ఖాయమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఒక్కటై నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ మోదీనే ప్రధాన మంత్రి అవుతారు. -బండి సంజయ్, బీజేపీ అభ్యర్థి
కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా ఓట్ల కోసం బీజేపీని పాకిస్తాన్ జట్టుతో పోల్చుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసమే పాటుపడుతోందని ముస్లిం ఓట్లతోనే అధికారంలోకి వస్తోందని ఆ పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగంగానే ప్రకటనలిస్తున్నారంటేనే అర్ధం చేసుకోండని అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలన్నలక్ష్యంతో పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే గుజరాత్‌లో ఏకగ్రీవంతో బోణీ అయిందని, మరో 399 కోసమే మీరు కష్టపడాలని బండి సంజయ్ కోరారు.
కరీంనగర్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులిద్దరూ చుట్టపు చూపుగా వచ్చిపోయే అభ్యర్ధులని ప్రజా సమస్యలపై ఏనాడూ పోరాడలేదని విమర్శించారు. ప్రజలు వాళ్లకు బుద్ది చెప్పాలని కోరారు. తనకు ఓటేస్తే ఎంపీగా నా ఓటును మోదీకి వేసి ప్రధానిని చేస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఓటేస్తే వాళ్లు ఎవరికి ఓటేస్తారో కూడా తెలియని పరిస్థితని ఎద్దేవా చేసారు. మోదీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాఖ్, రామ మందిర నిర్మాణం వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని తప్పకుండా బీజేపీకి ఓటేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.