Thummilla Water Dispute Between MLA and AICC Secretary : తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదల వివాదానికి దారితీసింది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంపు హౌజ్‌లో అలంపూర్ శాసనసభ్యుడు విజయుడు మోటార్లను ఆన్ చేసి కాల్వలకు నీటి విడుదల చేశారు.
ఎమ్మెల్యే వెళ్లిన కొద్ది సేపటికి అక్కడకు చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నీటి విడుదల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైప్ లైన్ ద్వారా 9 కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు 22వ డిస్టిబ్యూటరీ వద్ద ఆర్డీఎస్ కాల్వలకు చేరుకోవాల్సి ఉంది. ఉదయం ఏడున్నరకు మోటార్లు ఆన్ చేసిన ఎమ్మెల్యే తనగల గ్రామం ఆర్డీఎస్ 22డిస్టిబ్యూటరీ వద్దకు చేరుకున్నారు.
"ఇక్కడు భూములు ఎండిపోతుంటే రైతులు బాధ చూడలేక, కలెక్టర్ సహా నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాతే నేను నీళ్లు విడుదల చేశాను. కానీ వెంటనే సంపత్‌కుమార్ వచ్చి ఆఫ్ చేశారు. నేను ఉదయం 07:15 గంటలకు మోటర్లు ఆన్ చేసి వచ్చాక, వాళ్లు వెళ్లి ఆపడమేంటసలు."-విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే
స్థానిక ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి మధ్య వివాదం : రెండు, మూడు గంటలు దాటినా నీళ్లు రాలేదు. దీనిపై ఎమ్మెల్యే విజయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన మోటార్లను సంపత్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే ఆపేశారని ఆరోపించారు. నీళ్లు లేక తుమ్మిళ్ల ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయని, రైతుల ఆవేదన చూడలేక కలెక్టర్ సహా నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాతే తాను నీళ్లు విడుదల చేశానని చెప్పారు.
ఒకసారి మోటార్లు ఆన్ చేసిన తర్వాత ఆపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం సంపత్ కుమార్ నీళ్లు విడుదల చేస్తారని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మధ్య వివాదం చోటుచేసుకుంది. నీళ్లు ఆర్డీఎస్ కాల్వకు చేరే వరకూ అక్కడి నుంచి కదిలేదిలేదంటూ ఎమ్మెల్యే విజేయుడు నిరసనకు దిగారు.
Thummilla Water Release Controversy : మరోవైపు బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లవ్వడం లేదని దుష్ప్రచారం చేసేందుకే హడావుడిగా తుమ్మిళ్ల మోటార్లను ప్రారంభించారని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మధ్య నెలకొన్న ఈ వివాదంతో ప్రస్తుతం తనగల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలను అక్కన్నుంచి పంపించి వేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు విజేయుడిని అరెస్ట్ చేసి శాంతినగర్ పీఎస్‌కు తరలించారు.
KTR ON Alampur MLA Incident : ప్రజాపాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రోజూ అవమానాలే ఎదురవుతున్నాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అరెస్ట్ వ్యవహారంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఎమ్మెల్యే విజయుడును అధికారులు అవమానించారని, జిల్లా అధికారుల అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ నేతలను అధికారిక సమావేశాలు, కార్యక్రమాలకు ఎలా ఆహ్వానిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏ కారణాలతో హస్తం నేతలను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానపరచాలని ప్రోటోకాల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం మార్చిందా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు.. పంపింగ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేత సంపత్ కుమార్.
— BRS Party (@BRSparty) August 6, 2024
రైతుల సమస్యలను గుర్తించి సాగునీటిని విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విజయుడు. రైతులతో కలిసి… pic.twitter.com/X17vTXUp3K