AP CM Chandrababu about Rushikonda Palace : ఒక వ్యక్తి విలాసవంతాల కోసం ఏదైనా చేస్తారనేందుకు రుషికొండ భవనాలే నిదర్శనమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రుషికొండలోని విలాసవంతమైన 7 భవనాలను సందర్శించిన ఈయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతలా బరితెగించరని ధ్వజమెత్తారు. అరాచకాలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికివస్తారా అంటూ ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు.
ఈ భవనాలు దేనికి వాడుకోవాలో అర్థం కావడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. విలాసవంతమైన భవనాలను అందరికీ చూపిస్తామని, ప్రజల్లోనే చర్చ పెడతామని స్పష్టం చేశారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు జరుగుతాయా అనేలా ఈ భవనాలు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండె చెదిరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రుషికొండ భవనాలకు రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేసిందని మండిపడ్డారు.
గతంలో ప్రజాధనం దోచుకుని ఊరికొక ప్యాలెస్ : రుషికొండ పూర్తి వివరాలను ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ భవనాలపై ప్రజాభిప్రాయం సైతం తీసుకుంటామని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాధారణ వ్యక్తులు ఎవరూ ఇలాంటి ధైర్యం చేయరని అన్నారు. రుషులు తపస్సు చేసిన కొండనే గుండు చేశారని, ఇక్కడి 61 ఎకరాలు, కేసులు, అక్రమాలన్నీ ఆన్‌లైన్‌లో పెడతామని వెల్లడించారు. ప్రజలంటే కాస్తా కూస్తో భయం ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దోచుకుని గతంలో ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నారని, అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారని వ్యాఖ్యానించారు.
'ఇలాంటి పనులు చేస్తారని ఎవరూ కలలో కూడా ఊహించరు. ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ఇలాంటి పనులు చేశారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఇలాంటివి కట్టడం ఎక్కడా చూడలేదు'- చంద్రబాబు, ఏపీ సీఎం
హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాలను మభ్యపెట్టారు : విశాఖ ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి తప్పుడు పనులు చేశారని చంద్రబాబు అన్నారు. తవ్వినకొద్దీ ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. తప్పులు చేసి బుకాయించే వారిని ఏం చేయాలనే దానిపై చర్చ జరగాలని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థులపై పోరాడుతున్నామని, పర్యాటకంగా వాడేందుకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. ఈ భవనాలు ఎందుకు కట్టారో, ఏం చేద్దామనుకున్నారో చెప్పారా అని ప్రశ్నించారు.
ఇలాంటి అవినీతిపరులు హీరోలైతే సమాజం ఎటు పోతుందని ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. భవనాలకు మార్బుల్స్‌ను విదేశాల నుంచి తీసుకొచ్చారని, 100 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించారని తెలిపారు. 200 టన్నుల సెంట్రల్ ఏసీ, ఫ్యాన్సీ ఫ్యాన్లు పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి షాండ్లియర్లు కూడా తాను ఏక్కడ చూడలేదని వ్యాఖ్యానించారు. ఎన్‌జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాలను మభ్యపెట్టారని, పేదలను ఆదుకుంటామనేవారు ఇలాంటివి కట్టుకుంటారా అని నిలదీశారు.
టీ తయారుచేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - ఆ దృశ్యాలు మీరూ చూడండి
'నేను జైల్లో ఉన్నప్పుడు అలా చేశారు - ధైర్యంగా ఎదుర్కోవడంతో నా జోలికి ఎవరూ రాలేకపోయారు'