YS Jagan Visit Pulivendula : ఆయన పర్యటన ఉందంటే చాలు, రోడ్లపై పరదాలు దర్శనమిస్తాయి. ఓవైపు చెట్లు జడుసుకుంటాయి. అడ్డంగా ఉన్నామని తమను నరుకుతారోనన్న భయంతో. మరోవైపు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారోనని జనం జడుసుకుంటారు. వ్యాపారులు బెంబేలెత్తిపోతారు. ఆ రోజంతా దుకాణాలు మూసి వేయాలని పోలీసులు బెదిరింపులకు గుర్తి చేస్తారని. ముందస్తుగానే ఆ ప్రాంతంలోని ప్రతిపక్ష నేతలను గృహ నిర్భధం చేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే, వారిపై తిరిగి కేసులు పెడతారు.
People on YS Jagan Pulivendula Tour : మరోవైపు ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్లు తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్ స్టేషన్‌లో పడిగాపులు పడాల్సిందే. ఎందుకంటే వాటన్నింటినీ ఆయన పర్యటనకే తరలిస్తారు! దీనికితోడు పర్యటనలో వందల సంఖ్యలో పోలీసులు, అడుగడుగునా బారికేడ్లు, అనేక ఆంక్షలు. అదేెంటో విచిత్రం గాల్లో ఆయన ప్రయాణించినా అవే రూల్స్ విధిస్తారు. వారు వస్తుంటే, ఒక్క రోజు సహకరించలేరా అంటూ పోలీసులు, ఆ పార్టీ నేతలు జనంపై రుసరుసలాడుతారు.
ప్రజలు నెత్తీనోరు బాదుకున్నా ఆ మార్గంలో అనుమతించరు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యటనల పేరిట జనాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఎవరేమనుకుంటే మాకేంటి అని దులిపేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరో అన్నది. ఆయనేనండి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
ఏపీ వ్యాప్తంగానే కాకుండా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఇదే పరిస్థితి ఉండేది. సొంత నియోజకవర్గంలోనూ పరదాలు కట్టుకుని తిరిగి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. తాజాగా మూడు రోజుల జిల్లా పర్యటనకు ఆయన పులివెందులకు వచ్చారు. ప్రస్తుతం పులివెందులలో జనం జడుసుకోవడం గానీ, వ్యాపారులు బెంబేలెత్తడం గానీ, చెట్లు వణికిన దాఖలాలు, పోలీసుల ఆంక్షలు కన్పించలేదు.
ముక్కున వేలేసుకున్న స్థానికులు : ఆదివారం నాడు పులివెందుల నుంచి లింగాల మండలానికి బయలుదేరి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి దారి వెంబడి కాన్వాయ్ ఆపి స్థానికులు, కార్యకర్తలను పలకరించి వారితో సెల్ఫీలు దిగారు. పులివెందులలోనూ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇంతలో ఎంత మార్పు అని అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు.
"అన్నొస్తే.. అవస్థలే".. సీఎం వస్తే దారులన్నీ మూసేస్తారా.. ప్రజల అసహనం