Andhra Pradesh Exit Polls 2024: రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. ఏకపక్ష విజయంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సర్వేలన్నీ ఢంకా బజాయించాయి. సైకిల్ స్పీడ్‌కు వైఎస్సార్సీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని మెజార్టీ సర్వేలు తేల్చాయి. కొన్ని సర్వేలు కూటమిలోని తెలుగుదేశంపార్టీ ఒక్కటే అధికారానికి అవసరమైన స్థానాలు గెలుచుకోబోతున్నట్లు వెల్లడించాయి. ఈ నెల 4న అసలు సిసలు ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయాన్నందుకోబోతున్నట్లు వివిధ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంనచాలు వెల్లడించాయి.
People Pulse: పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ లెక్క ప్రకారం కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం ఒక్కటే 95 నుంచి 110 స్థానాలు గెలుచుకోనుంది. కూటమి మిత్రపక్షాలైన జనసేన 14 నుంచి 20 సీట్లు, బీజేపీ 2 నుంచి 5 సీట్లు దక్కించోవచ్చని తెలిపింది. ఇక అధికార వైఎస్సార్సీపీ 45 నుంచి 60 స్థానాలకే పరిమితం కాబోతుందని స్పష్టం చేసింది. లోక్‌సభ ఫలితాల్లోనూ అదే ఒరవడి కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ సర్వే లెక్కలు వేసింది. తెలుగుదేశం 13 నుంచి 15, జనసేన 2, బీజేపీ 2 నుంచి 4 సీట్లు కైవసం చేసుకోనుండగా వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడించింది.
ఎగ్జిట్ పోల్స్ - ఏపీలో ఏ పార్టీకి ఎన్ని లోక్‌సభ స్థానాలంటే! - Lok Sabha Exit Polls Result 2024
Rise Survey: ఇక రైజ్ అనే సర్వే సంస్థ కూడా కూటమికే పట్టం కట్టింది. తెలుగుదేశం కూటమి 113 నుంచి 122 స్థానాలు గెలుచుకనుండగా వైఎస్సార్సీపీ 48 నుంచి 60 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోవడం ఖాయమని తేల్చిచెప్పింది. ఇక లోక్‌సభ స్థానాల్లోనూ తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 20, వైఎస్సార్సీపీ 7 నుంచి 10 సీట్లు గెలుచుకోవచ్చని వెల్లడించింది.
KK Surveys: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాన్నదుంకుటుందంని చెప్పిన కేకే సర్వేస్ అనే సంస్థ ఈసారి కూటమిదే ఆధిపత్యమని స్పష్టం చేసింది. కూటమిలో తెలుగుదేశం ఒక్కటే ఏకంగా 133 స్థానాలు కైవసం చేసుకోనుండగా జనసేన 21, బీజేపీ 7 స్థానాలు గెలుకుటుంటాయని తెలిపింది. వైఎస్సార్సీపీ కేవలం 14 సీట్లతో దారుణ పరాభవాన్ని ఎదుర్కోబోతున్నట్లు అంచనా వేసింది. ఇక లోక్‌సభ సీట్లను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు కేకే సర్వేస్ తెలిపింది. వైఎస్సార్సీపీ ఒక్కటంటే ఒక్కసీటూ గెలుచుకోలేదని, తెలుగుదేశం 17, జనసేన2, బీజేపీ 6 స్థానాలు కైవసం చేసుకుంటాయని వెల్లడించింది.
Chanakya Strategies: చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం కూటమి 114 నుంచి 125 సీట్లో చేజిక్కించుకోనుండగా వైఎస్సార్సీపీ 39 నుంచి 49 స్థానాలకు మించదని తేల్చిచెప్పింది. ఇతరులు ఒక స్థానం గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఇక లోక్‌సభ విషయానికొస్తే తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 18 సీట్లు దక్కించుకోనుండగా వైఎస్సార్సీపీ 6 నుంచి 7 స్థానాలకే పరిమితం కాబోతోందని వెల్లడించింది.
Pioneer Survey: తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయాన్నందుకోబోతున్నట్లు పయనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది. తెలుగుదేశం కూటమి అత్యధికంగా 144 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ 31 సీట్లతో చతకిలపడడం ఖాయమని తేల్చింది. ఇక లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 20, వైఎస్సార్సీపీ 5 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది.
Janagalam Survey: జనగళం సర్వే సంస్థ కూడా కూటమికే జనామోదమని స్పష్టం చేసింది. తెలుగుదేశం కూటమి 104 నుంచి 118 స్థానాలు గెలుచకోనుండగా వైఎస్సార్సీపీ 44 నుంచి 57 స్థానాలకు పరిమితం కాబోతోందని తెలిపింది.
India TV: జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించే ఇండియా టీవీ కూడా రాష్ట్రంలో కూటమిదే ఆధిపత్యమని తేల్చింది. 25 లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 13 నుంచి 15, బీజేపీ 4 నుంచి 6, జనసేన 2 సీట్లు గెలుచకుంటుందని తెలిపింది. ఇక వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని అంచనా వేసింది.
CNX: సీఎన్ఎక్స్ అనే సంస్థ కూడా కూటమిదే హవా అని తేల్చింది. తెలుగుదేశం 13 నుంచి 15, బీజేపీ 4 నుంచి 6, జనసేన 2, వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది.
ABP - C: ఏబీపీ - సీ ఓటర్ సంస్థ తెలుగుదేశం కూయటకి 21 నుంచి 25 స్థానాలు కట్టబెట్టగా వైఎస్సార్సీపీ నాలుగు స్థానాల వరకూ గెలుచుకోవచ్చని తెలిపింది.
India News - D-Dynamics: ఇండియా న్యూస్- డీ-డైనమిక్స్ కూడా. తెలుగుదేశం కూటమి 18 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ 7 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
News-18: న్యూస్-18 సంస్థ కూడా తెలుగుదేశం కూటమిదే విజయమని తేల్చింది. తెదేపా కూటమి అత్యధికంగా 19 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకోనుండగా వైఎస్సార్సీపీ 5 నుంచి 8 స్థానాలకు పరిమితం కావాల్సిందేనని స్పష్టం చేసింది.
Today Chanakya: మరో జాతీయ సంస్థ టుడేస్ చాణక్య కూడా తెలుగుదేశం కూటమికే పట్టం కట్టింది. ఆ కూటమి 19 నుంచి 25 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ సున్నా నుంచి 6 స్థానాలు దక్కించుకోవచ్చని తెలిపింది.
Times Now: జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ మాత్రం వైఎస్సార్సీపీకి 13 నుంచి 15 లోక్‌సభ స్థానాలు గెలవొచ్చని తెలిపింది. తెలుగుదేశం 7 నుంచి 9 స్థానాలు, జనసేన 1, బీజేపీ 2 సీట్లు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.