South States on Central Funds : జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు కేటాయించాలంటూ 15వ ఆర్థిక సంఘం తీసుకున్న నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు అన్యాయం జరగుతుందంటూ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు దేశ రాజధాని దిల్లీలో నిరసనలకు దిగాయి. తమ హక్కు ప్రకారం నిధులు ఇవ్వాలంటూ జంతర్‌మంతర్ వద్ద కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఆందోళనలు చేపట్టాయి. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర నిధుల కేటాయింపులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో వనరుల పంపిణీకి నూతన ఆర్థిక సంఘం దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటుందన్నది ప్రధానాంశంగా మారింది.
అంతకుముందు ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం ప్రకారం, ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకు వారి అవసరాల దృష్ట్యా అధిక నిధులు కేటాయించాలని (15th finance commission recommendations) సూచించింది. అయితే, దీనివల్ల జనాభా పెరుగుదలను సమర్థంగా కట్టడి చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఈ అంశంలో విఫలమైన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాలకు కేంద్రం నిధుల్లో సింహ భాగం దక్కనుంది. 2017 నవంబరు 27న ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం 2020 ఏప్రిల్ 1 నుంచి ఆరేళ్ల కాలానికి సిఫార్సులు చేసింది. అవి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గత ఆర్థిక సంఘం ఈ సిఫార్సులు చేసింది. అయితే, తాజాగా జరగాల్సిన 2021 జనగణనను నిర్వహించలేదు కాబట్టి ఇప్పుడు కూడా అదే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
అరవింద్ నేతృత్వంలో కొత్త ఆర్థిక సంఘం
కేంద్ర ప్రభుత్వం ఇటీవలె 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను (16th finance commission chairman) 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా నియమించింది. 71 ఏళ్ల పనగడియా నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు పనిచేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదివరకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముఖ్య ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. ఈ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కాల వ్యవధి 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఉంటుంది. అందువల్ల 2025 అక్టోబరు 31 నాటికి రాష్ట్రపతికి నివేదిక సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. దేశవ్యాప్తంగా పర్యటించి, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని నివేదిక అందించడానికి రెండేళ్ల సమయం పడుతుంది.
ఆర్థిక సంఘం అంటే ఏంటి?
ఆర్థిక సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యంగ సంస్థ. కేంద్రానికి వచ్చే పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280(1) ప్రకారం ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు. 1951 నుంచి ఈ ఆర్థిక సంఘాలను నియమిస్తున్నారు. కేంద్రం అందించే గ్రాంట్ల పంపిణీ, రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ వ్యవస్థలకు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ ఆర్థిక సంఘం సూచిస్తుంది.
ప్రస్తుతం అనుసరిస్తున్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు 41శాతం పన్నులు కేటాయించాల్సి ఉంది. వీటిని 2021-22 నుంచి 2025-26 బడ్జెట్ల మధ్య 14 సార్లు విడత వారీగా నిధులు కేటాయిస్తుంది. అయితే, 2024-2025 బడ్జెట్లో మాత్రం ఆర్థిక సంఘం సిఫార్సులను పాటించకుండా కేవలం 35శాతం నిధులను కేటాయించింది. సెస్సులు, సర్ఛార్జీలు పెరగడం వల్ల పన్నుల వాటాను 10శాతం పెంచారని ఆర్బీఐ ఓ నివేదికలో తెలిపింది. 2011-12లో 78.9శాతం ఉండగా, 2021-22 నాటికి దానిని 88.6శాతానికి ఆర్థిక సంఘం పెంచిందని పేర్కొంది. సెస్సులు, సర్ఛార్జీలతోనే కేంద్రానికి ఆదాయం వస్తుందని, వాటినే రాష్ట్రాలకు కేటాయిస్తుందని ఆర్బీఐ చెప్పింది. అందుకోసమే రాష్ట్రాలు తమ స్వంత ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించింది.
దక్షిణాది రాష్ట్రాల వాదనల్లో రెండు ప్రధానమైనవి. మొదటిది 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువ కేటాయించడం కాగా, జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని సూచించడం రెండోది. 2011 జనగణన ఆధారంగా జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించడం వల్ల నష్టపోతామని ఆరోపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అదుపు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతకుముందు 1971 జనగణనను పరిగణలోకి తీసుకుని కుటుంబ నియంత్రణ చేసిన రాష్ట్రాలకు గతంలో ప్రోత్సాహాకాలు ఇచ్చేవి.
అయితే, తాజాగా ఆర్థిక సంఘం నిర్ణయంతో ఒక రాష్ట్ర జనాభా ఎక్కువగా ఉంటే, దాని అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు అందుతాయి. అందువల్ల దేశంలోని తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలు తక్కువ ఆదాయాన్ని పొందుతాయి. ఎక్కువ ఆదాయం, పన్నులు సంపాదించే దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాలు అధిక నిధులను పొందుతాయి. దీనిని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ జనాభా 2001 నుంచి 2011 నాటికి 20శాతానికి పైగా, బిహార్ జనాభా 25శాతానికి పైగా పెరిగింది. అదే దక్షిణాది రాష్ట్రం తమిళనాడు కుటుంబ నియంత్రణను సమర్థంగా చేసి కేవలం 15శాతం మాత్రమే పెరిగింది. కర్ణాటకలో సైతం 15.60 శాతమే పెరిగింది. కాగా జనాభా పెరుగుదల కారణంగా ఉత్పన్నమయ్యే సవాళ్లను పరిశీలించడానికి కేంద్రం ఓ కమిటీని ఇప్పటికే నియమించింది.
నిధుల కేటాయింపులో భారీ అంతరం
అయితే, 15వ ఆర్థిక సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళపై ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి బడ్జెట్లో కేవలం 15.8శాతం వాటా వస్తుండగా, ఉత్తరాదిలోని బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రెండు రాష్ట్రాలకే సుమారు 28శాతం వాటా అందనుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక, కేరళ రాష్ట్రాలు దేశ రాజధాని దిల్లీలో ఆందోళన చేపట్టాయి. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపుతో తలసరి ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా అధిక నిధులను పొందనున్నాయి. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ప్రదర్శన చేసినా, జనాభా తక్కువ ఉండడం వల్ల తక్కువ నిధులను పొందనుంది. ప్రస్తుతం పన్నుల కేటాయింపులకు జనాభా, అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకుంటుంది. దీని ప్రకారం అధిక జనాభా, తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోకుండా జనాభా నియంత్రించినా కూడా తక్కువ నిధులు కేటాయిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
కొత్త విధానం ఎలా ఉండనుందో?
ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి కేంద్రం సుమారు రూ.8.20లక్షల కోట్లను 12 విడతల వారీగా రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. మొత్తం బడ్జెట్ లక్ష్యం రూ.10.21లక్షల కోట్లు కాగా, ఆ తర్వాత రూ. 11.04లక్షల కోట్లుగా అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని రూ.12.20 లక్షల కోట్లకు పెంచనుంది. ఇది దేశ జీడీపీలో 3.7శాతంగా ఉంది. ఇప్పటికే జీఎస్టీతో తమ ఆదాయాన్ని తగ్గించగా, ఇప్పుడు పన్నుల వాటాను కేంద్రం తగ్గిస్తోందని రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఓ ఉన్నతాధికారి, ఆర్థిక సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దానిలో కేంద్రం పాత్ర ఏ మాత్రం ఉండదని చెప్పారు. పన్నుల కేటాయింపులపై చర్చ కొంతకాలంగా ఉందని, దీనిని 16వ ఆర్థిక సంఘం పరిశీలిస్తుందన్నారు. ప్రస్తుతం ఆ అంశం ఆర్థిక సంఘం పరిధిలో ఉందని తెలిపారు. సెస్సులు, సర్ఛార్జీలను రాష్ట్రాలకు కేటాయించడం 16వ ఆర్థిక సంఘం ముందున్న ప్రధాన సమస్యగా మారింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను తేల్చడానికి ఆర్థిక సంఘం ఎలాంటి కొత్త విధానాన్ని తీసుకురానుందో వేచి చూడాలి.