Prathidhwani Debate on Farmers Problems : ప్రపంచంలో ఎక్కడైనా ఒక వస్తువును ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వారే దాని ధర నిర్ణయిస్తారు. ఒక్క రైతు తప్ప. తాను పండించే పంటకు ధరను తాను నిర్ణయించలేని నిస్సహాయత అన్నదాతది. ఓ వైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టిని తట్టుకుంటూ అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి మన ఆకలి తీరుస్తున్నాడు. ప్రపంచంలో ఏ వృత్తిలోనూ లేనన్ని బలవన్మరణాలు కేవలం వ్యవసాయ రంగంలోనే మనకి కనిపిస్తాయి.
దానికి కారణం మన కడుపు నింపుతూ తాను పస్తులు ఉండటమే. ఆరుకాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తుంటే అకాల వర్షాల వల్ల పంటలు పాడైపోతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలలో వర్షానికి వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. ప్రకృతి పగబడితే ఆ తప్పు రైతులదా? ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, సమాజం మీద లేదా? ఎండైనా, వానైనా, పగలైనా, రాత్రయినా పోలంలోనే ఉంటూ, అక్కడే తింటూ సమాజం కోసం శ్రమిస్తున్న కర్షకుల కష్టానికి ఫలితం ఎందుకు దక్కట్లేదు? ఇదీ నేటి ప్రతిధ్వని.