Loksabha Election National Parties Count : 1951లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 53 పార్టీలు పోటీ చేశాయి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 2,500 పార్టీలు నిలబడుతున్నాయి. అయితే ఈ ఏడు దశాబ్దాల్లో జాతీయ పార్టీల సంఖ్య 14 నుంచి 6కు పడిపోయింది. 18వ లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 6 జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయనున్నాయి. 7 దశాబ్దాల ప్రజాస్వామ్య చరిత్రలో రాజకీయ పార్టీల ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. కొన్ని పార్టీలు విలీనం కాగా మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి మరికొన్ని పార్టీలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
14 పార్టీలకే జాతీయ హోదా!
తొలి లోక్‌సభ ఎన్నికల్లో 53 పార్టీలు పోటీ చేయగా వాటిలో 14 జాతీయ పార్టీలు ఉన్నాయి. మిగిలిన పార్టీలన్నీ రాష్ట్రాలకు చెందినవే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన "లీప్ ఆఫ్ ఫెయిత్" పుస్తకం ప్రకారం 1953కు ముందు 29 పార్టీలు తమకు జాతీయ హోదా ఇవ్వాలని ఈసీని కోరాయి. అయితే వాటిలో 14 పార్టీలకే జాతీయ హోదా దక్కింది. ఫలితాల తర్వాత ఆ 14లో 4 పార్టీలైన కాంగ్రెస్, ప్రజాసోషలిస్టు పార్టీ, సీపీఐ, జనసంఘ్ మాత్రమే జాతీయ హోదాను నిలబెట్టుకున్నాయి.
జాతీయ పార్టీ గుర్తింపును కోల్పోయి!
అఖిల భారతీయ హిందూ మహాసభ, ఆల్ ఇండియా భారతీయ జనసంఘ్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కేస్ట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్-MG, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్-RG, క్రిషికార్ లోక్ పార్టీ, బోల్‌షేవిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలు జాతీయ పార్టీ గుర్తింపును కోల్పోయాయి. సోషలిస్టు పార్టీ, కిషన్ మజ్దూర్ పార్టీ తొలి లోక్‌సభ ఎన్నికల్లో వేర్వురుగా పోటీ చేసి ఆ తర్వాత ప్రజా సోషలిస్టు పార్టీ పేరుతో విలీనమయ్యాయి.
మొత్తం 27 పార్టీలు!
1957లో జరిగిన రెండో లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల సంఖ్య 15కు తగ్గిపోయింది. వాటిలో 4 జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. 1962లో జరిగిన తదుపరి సార్వత్రిక పోరులో మొత్తం 27 పార్టీలు అదృష్టం పరీక్షించుకున్నాయి. ఆ ఎన్నికల్లో జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పెరిగింది. అంతకుముందు ఉన్న 4 జాతీయ పార్టీలకు తోడుగా సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీలు కొత్తగా చేరాయి. తొలి ఎన్నికల నుంచి 2014 ముందు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. అప్పటి వరకు కూడా 14సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా 11 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో గాలి బీజేపీ వైపు మళ్లింది.
సీపీఐతో పోల్చితే!
1951 తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1964లో సీపీఐ నుంచి సోవియట్, చైనీస్ కమ్యూనిస్టు విభాగాలు బయటకు వచ్చేసి సీపీఎం ఏర్పడింది. సీపీఐతో పోల్చితే CPM లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లుసాధించింది. సోషలిస్టు పార్టీ మూలాలు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో భాగంగా జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని ఏర్పాటుచేశారు.
ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా!
దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. జయ ప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడినప్పటికీ సోషలిస్టు పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. తర్వాత జేబీ కృపలానీకి చెందిన కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీతో విలీనమై ప్రజా సోషలిస్టు పార్టీ-PSPని ఏర్పాటు చేశారు. అయితే కొన్నాళ్ల పాటు పార్టీకి దూరమైన జయప్రకాశ్ నారాయణ్ 1970ల మధ్యలో తిరిగి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు.
ఇందిరపై అనర్హత వేటు వేయాలని!
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు ఇందిరాగాంధీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసిన జయ ప్రకాశ్ నారాయణ్‌ను అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత నారాయణ్, పీఎస్పీ నేతలు ఇతర వర్గాలతో కలిసి భారతీయ లోక్‌దళ్‌ను స్థాపించారు. 1977లో ఇతర విపక్షాలన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఎదురించారు.
1996 సార్వత్రిక పోరులో!
బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ సహా ఇప్పుడున్న అనేక పార్టీల మూలాలు జనతా పార్టీలో ఉన్నాయి. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 1992 లోక్‌సభ ఎన్నికల్లో అతి తక్కువ పార్టీలు పోటీ చేశాయి. వాటిలో ఏడు జాతీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, జనతా పార్టీ, లోక్‌దళ్ ఉన్నాయి. 1996 సార్వత్రిక పోరులో 209 రాజకీయ పార్టీలు పాల్గొనగా వాటిలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి.
ఆ హోదాతో 2019 ఎన్నికల్లో!
1998 ఎన్నికల్లో ఏడు జాతీయ పార్టీలు సహా 176 పార్టీలు పోటీ చేశాయి. 1999లో 160 పార్టీలు పోటీ చేయగా వాటిలో ఏడు జాతీయ పార్టీలు ఉన్నాయి. కొత్తగా బీఎస్పీ చేరగా, జనతాదళ్ రెండుగా చీలిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 464 పార్టీలు అదృష్టం పరీక్షించుకున్నాయి. వాటిలో ఆరు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ ఉన్నాయి. 2016లో జాతీయ హోదా సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ఆ హోదాతో 2019 ఎన్నికల్లో పోటీ చేసింది.
నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా!
2019లో 674 పార్టీలు పోటీ చేయగా వాటిలో 7 జాతీయ పార్టీలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, BSP, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్ జాతీయ పార్టీలుగా బరిలో నిలిచాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్, NCP, సీపీఐ జాతీయపార్టీ హోదాను కోల్పోయాయి. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే మొత్తం లోక్‌సభ సీట్లలో 2శాతం సీట్లను కనీసం మూడు రాష్ట్రాల్లో గెలవాలి. లేదంటే 4 లోక్‌సభ సీట్లతో పాటు 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లను సాధించాలి. నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందినా సరే సదరు పార్టీకి జాతీయ పార్టీ హోదా లభిస్తుంది.
ఎక్కడ పోటీ చేసినా ఒకే గుర్తును!
గత ఏడాది ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించింది. జాతీయ పార్టీ హోదా సాధించిన పార్టీ దేశంలో ఎక్కడ పోటీ చేసినా ఒకే గుర్తును కేటాయిస్తారు. అలాగే దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయిస్తారు. ఈసీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉంది.