Lok Sabha Polls 2024 Rajasthan: రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలకు మొదటి రెండు విడతలైన ఏప్రిల్ 19, 26 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ మంచి జోరుమీదుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా క్లీన్‌స్వీప్ చేయాలని ఊవిళ్లూరుతోంది. 2014నాటి ఎన్నికల్లో 25 సీట్లూ కొల్లగొట్టిన కమలదళం 2019లో 24చోట్ల విజయం సాధించగా మిత్రపక్షం లోక్‌తాంత్రిక్ పార్టీ ఒకచోట గెల్చింది. ఫలితంగా రాజస్థాన్‌లో గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవకుండా బీజేపీ అడ్డుకోగలిగింది.
డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతోనే
2019లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అన్నిచోట్లా బీజేపీ, దాని మిత్రపక్షమే విజయం సాధించగా ఈసారి కూడా అదే ఊపు కొనసాగించాలని కమలదళం చూస్తోంది. ప్రస్తుతం అధికారం చేతిలో ఉన్నందున డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి దూసుకెళుతోంది. అయోధ్యలో రామమందిర ప్రారంభం తాలూకూ సానుకూల వాతావరణం మధ్య హ్యాట్రిక్ కొట్టాలని సంకల్పించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలీయంగా ఉండడం కూడా కమలదళానికి కలిసొస్తోంది.
ఆ వర్గాల్లో బీజేపీపై అసంతృప్తి
అనేక సానుకూల అంశాలతో బీజేపీ దూసుకెళ్లాలని చూస్తున్నప్పటికీ ఆ మార్గంలో కొన్ని అవాంతరాలు కూడా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 సీట్లకు 115 చోట్ల గెల్చినప్పటికీ తర్వాత కరన్‌పుర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. తమ పార్టీ అభ్యర్థిని మంత్రిని చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు పార్టీకి చెందిన చురు ఎంపీ రాహుల్ కస్వాన్ టికెట్ దక్కలేదన్న కారణంతో రాజీనామా చేశారు. మీనాలు, గుజ్జర్లు, జాట్లు వంటి ప్రధాన వర్గాల నుంచి బీజేపీపై నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న కిరోడి లాల్ మీనాకు పదవి ఇవ్వకపోవడంపై మీనా వర్గం బీజేపీపై అసంతృప్తితో ఉంది. కేబినెట్‌లో తమ వర్గానికి తగిన ప్రాధాన్యం దక్కలేదనే వాదన గుజ్జర్ల నుంచి వినిపిస్తోంది. తమను ఓబీసీల్లో చేర్చాలంటూ జాట్లు జనవరి నుంచి ఆందోళన పథంలో ఉన్నారు.
కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
అయితే కాంగ్రెస్‌కు ఉన్న కష్టాలతో పోలిస్తే బీజేపీవి పెద్ద సమస్యలేమీ కాదు. అసలే అధికారం దూరమై పుట్టెడు బాధలో ఉన్న ఆ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు కంటిలో నలుసులా మారాయి. మాజీ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాలు తూర్పు, పడమర అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య నాలుగు సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మహేంద్రజిత్ సింగ్ మాలవీయా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నాయకురాలు జ్యోతి మిర్ధాకు బీజేపీ నాగౌర్ టికెట్ ఇచ్చింది.
ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యేలు రిచ్‌పాల్, విజయ్‌పాల్ మిర్దా, అలోక్ బేణివాల్ పార్టీకి రాజీనామాలు చేశారు. ఈ పరిస్థితులు బీజేపీకు బాగా అనుకూలిస్తున్నాయి. చివరకు కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలాచోట్ల అభ్యర్థులు కూడా కరవయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్ నేతలను పోటీకి దింపుతోంది. కొన్నిచోట్ల వారు కూడా సానుకూలంగా లేరని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి నాయకత్వంలో కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి చేటు చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే మెజార్టీ వర్గమైన గుజ్జర్లు బీజేపీపై అసంతృప్తిగా ఉండగా వారిని తమవైపు తిప్పుకొని కొన్నిసీట్లు గెల్చుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అసెంబ్లీ ఫలితాల జోష్- MPలో క్లీన్ స్వీప్‌పై బీజేపీ గురి- తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్!
ఇంట్రెస్టింగ్గా 'మహా ఎన్నికలు'- రెండు కూటముల మధ్య కుమ్ములాట- ఎవరిది విజయమో?