LK Advani Political Career : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ప్రచారక్‌గా చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర పోషించిన లాల్ కృష్ణ అడ్వాణీ, భారతీయ జన్‌సంఘ్‌లో చేరారు. 1966-67 మధ్య జరిగిన దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల బరిలో దిగడం ద్వారా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. 1966లో దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికైన అడ్వాణీ, మరుసటి ఏడాదే దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు. 1970-72 మధ్య భారతీయ జనసంఘ్ దిల్లీ విభాగం అధినేతగా పనిచేశారు. 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టారు అడ్వాణీ.
కేంద్రమంత్రి, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు
1973 నుంచి 76వరకు జన్‌సంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అడ్వాణీ, 1974 నుంచి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1976-1982 మధ్య గుజరాత్ నుంచి మరోసారి పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సందర్భంగా అరెస్టైన అడ్వాణీ, వాజ్‌పేయీ వంటి నేతలు 1976లో జయప్రకాశ్ నారాయణ స్థాపించిన జనతా పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించడం వల్ల మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో అడ్వాణీ, సమాచార, ప్రసార శాఖ మంత్రిగా 1977 నుంచి 79 వరకు పనిచేశారు. తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోవడం వల్ల 1980 జనవరి నుంచి ఏప్రిల్ వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.
ఎంపీ స్థానాలు పెంచడంలో అడ్వాణీదే కీలకపాత్ర
1980లో దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సమావేశమైన 3,500 మంది నేతలు 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు. అలా వాజ్‌పేయీ, అడ్వాణీ, భైరాన్ సింగ్ షెకావత్, మురళీ మనోహర్ జోషి వంటి నేతల చొరవతో భారతీయ జనతా పార్టీ దిల్లీలో పురుడు పోసుకుంది. తొలి అధ‌్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎన్నిక కాగా, అడ్వాణీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ప్రారంభంలో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగా, బీజేపీకి కేవలం రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే లభించాయి. 1986లో అడ్వాణీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎంపీ స్థానాల సంఖ్యను 86కు పెంచుకోవడంలో అడ్వాణీదే కీలకపాత్ర అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఉప ప్రధానిగా సేవలు
1991 నుంచి 96 మధ‌్య పీవీ నరసింహరావు హయాంలో అడ్వాణీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించింది. 1996లో అడ్వాణీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బీజేపీ అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 13రోజులకే కుప్పకూలింది. అనంతరం రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడ్వాణీ కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఏడాదికే ఎన్డీఏ సర్కార్ కుప్పకూలింది. 1999లో మళ్లీ ఎన్నికలు జరగ్గా వాజ్‌పేయీ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. 2004 వరకు బీజేపీ పాలన సాగగా, అడ్వాణీ కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉపప్రధానిగా పనిచేశారు. అదే సమయంలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా కేంద్ర సిబ్బంది శిక్షణా మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను కూడా అడ్వాణీ నిర్వహించారు.
75ఏళ్ల రూల్‌తో రాజకీయాలకు దూరం
2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలుకాగా, అడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇదే క్రమంలో వాజ్‌పేయీ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోగా బీజేపీ అధినేతగా అడ్వాణీ ముందుండి పార్టీని నడిపించారు. RSS సూచనల మేరకు 2005లో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అడ్వాణీ ఆ బాధ్యతలను రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అడ్వాణీ పోటీ పడినా ఘోర పరాజయం చవిచూసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ, 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అడ్వాణీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయాత్మక పాత్రను పోషించారు. ఆ తర్వాత 75 ఏళ్లుపైబడిన వారిని ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించడం వల్ల అడ్వాణీకి బీజేపీ విశ్రాంతినిచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికలకు గాంధీనగర్ నుంచి అడ్వాణీకి బదులుగా అమిత్ షా పోటీ చేయడం వల్ల అగ్రనేత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.