K Annamalai Plans For LS Polls 2024 : ఈ సార్వత్రిక ఎన్నికల్లో 370 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2019 ఎన్నికల్లో 303 చోట్ల జయభేరి మోగించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్ విజయం దద్దరిల్లిపోయేలా ఉండాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాదిలో పట్టు కొనసాగిస్తూనే దక్షిణాదిలో ఉనికిని గట్టిగా చాటాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా తమిళనాట ఓట్ల శాతం పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈసారి 20 శాతం ఓట్లతోపాటు కొన్ని సీట్లు కూడా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశలో బీజేపీకి తురుపుముక్క లాంటి నాయకుడిలా అన్నామలై కనిపించారు. తమిళనాట ఇప్పటివరకూ ద్రవిడ వాదంపైనే రాజకీయాలు నడుస్తుండగా అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ హిందుత్వ వాదంపైనా చర్చ మొదలుపెట్టారు.
ఖాతా తెరవని బీజేపీ
ఇప్పటివరకూ తమిళనాట బీజేపీకి ఓటర్ల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. 2014 ఎన్నికల్లో ఒక్కచోట గెలిచినప్పటికీ 2019 ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. పక్క రాష్ట్రం కర్ణాటకలో చాలాసార్లు అధికారంలో ఉన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తున్నప్పటికీ తమిళనాడులో మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
8నెలల్లో 235 చోట్ల పర్యటన
అయితే ఇటీవల తమిళ ప్రజల మనస్సుల్లో చోటు కోసం బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. అందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా ఎంతో దూకుడుగా పనిచేసిన అన్నామలై 2019లో తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనతికాలంలోనే అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆయన, 2021లో పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. 'నా నేల-నా ప్రజలు' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు నిర్వహించిన అన్నామలై ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ తమిళనాట చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశమవుతూ 8నెలలపాటు 235 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుదీర్ఘ పర్యటనలు చేశారు.
మాజీ సీఎంలపైనే విమర్శలు
తమిళనాట అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకేపై విమర్శలు గుప్పిస్తూ వాటికి బీజేపీనే ప్రత్యామ్నాయం అనే వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు అన్నామలై. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, జయలలితపైనా విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మిత్రపక్షం ఏఐఏడీఎంకే బీజేపీతో బంధం తెంచుకోగా డీఎండీకే, పీఎంకే, పీఎన్కే, టీటీవీ దినకరన్‌కు చెందిన ఏఎంఎంకే వంటి పార్టీలతో అన్నామలై జట్టు కట్టారు.
అలాగే కొందరు ఏఐఏడీఎంకే నేతలను పార్టీవైపు ఆకర్షించడంలోనూ సఫలమయ్యారు. ఏఐఏడీఎంకే బహరిష్కరించిన కీలక నేత పన్నీరుసెల్వంను బీజేపీవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా అన్ని విధాలుగా సామాజిక సమీకరణలో బలంగా ఉన్న పార్టీలను కలుపుకొని ముందుకెళుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తమిళనాట మొత్తం 39 స్థానాలకు బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేస్తోంది.
'2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఉండదు'
మరోవైపు ద్రవిడ రాజకీయాలకు తమిళనాట కాలం చెల్లుతోందంటూ అన్నామలై దేశ ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న డీఎంకే 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చరిత్రలో కలిసిపోతుందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి తమిళనాట ద్రవిడ వాదంతో పార్టీలు రాజకీయాలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఆ భావన పెద్దగా కనిపించదు. నిజానికి తమిళనాడులో భక్తి భావం దక్షిణాదిలో ఎక్కడా లేనంతగా కనిపిస్తుంది.
చారిత్రక కట్టడాలు సహా అన్ని గ్రామాల్లోనూ ఆలయాలు దర్శనమిస్తుంటాయి. తిరుమలలో కనిపించే రద్దీలో 40 శాతం తమిళనాడు నుంచి వచ్చే భక్తులే ఉంటారు. ఈ విషయాలను లోతుగా గమనించిన అన్నామలై ద్రవిడవాద ముసుగులను తొలగించాలంటూ రాష్ట్రవ్యాప్త పర్యటనల్లో గట్టిగా తన గళాన్ని వినిపించారు. ఇదేసమయంలో హిందుత్వ నినాదంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఎదురుదాడితో డీఎంకేను ఇరకాటంలో పడేలా చేశారు.
అన్నామలై మ్యాజిక్ పనిచేస్తుందా?
2019 లోక్‌సభ ఎన్నికల్లో 3.66 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 20 శాతం ఓట్లు దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే డబుల్ డిజిట్ సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. తమిళనాట ఈనెల 19న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా అన్నామలై మ్యాజిక్ ఏమాత్రం పనిచేస్తుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">