Chhattisgarh Lok Sabha Polls 2024 : సార్వత్రిక ఎన్నికల సమరంలో ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 11 లోక్‌సభ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లో బీజేపీ 9 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పోలింగ్ తేదీకి సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ-కాంగ్రెస్ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెట్టాయి. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో జరిగిన అభివృద్ధి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అయోధ్య రామాలయ ప్రారంభం ప్రధాని మోదీ చరిష్మాలే ప్రధాన అస్త్రాలుగా బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ సర్కార్ నెరవేర్చింది. దీనిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మరోవైపు వ్యవసాయ సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కుల గణన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వెళ్తోంది.
కాంగ్రెస్ సత్తా చాటుతుందా?
ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ బీజేపీకు ప్రధాన బలంగా మారనుంది. అబ్‌కీ బార్ చార్ సౌ పార్ అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు శ్రేణులు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 11 స్థానాలకు బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను నిరాకరించింది. ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురు మహిళా నేతలకు కమలం పార్టీ టికెట్లు ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఇద్దరు మాజీ మంత్రులకు సీట్లు కేటాయించింది. ఏడాది క్రితం వరకూ ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాకర్షక పథకాలు అభివృద్ధిపై భారీ నమ్మకం పెట్టుకున్నా 2023 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని హస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది.
మోదీ విస్తృత ప్రచారమే!
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ హిందుత్వం, ప్రజా కర్షక హామీలతో దూకుడుగా ప్రచారం నిర్వహించిన బీజేపీ, 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 54 స్థానాలను కైవసం చేసుకుంది. శాసనసభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 35 సీట్లు గెలుచుకోగలిగింది. శాసనసభ ఎన్నికల్లో బీజేపీకు 46.27 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 42.23 శాతం ఓట్లు వచ్చాయి.
అధికారంలో లేకపోయినా!
అయితే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ను విభజించినప్పటి నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించలేదు. 2004, 2009, 2014,2019 పార్లమెంటు ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అంచనాల మేర రాణించలేదు. 2004, 2009, 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 11 స్థానాల్లో 10 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా తొమ్మిది స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమరంలోనూ కాంగ్రెస్‌కు ఎదురుగాలే విస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి.
అవినీతే ప్రధాన అస్త్రం!
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఈసారి అవినీతి ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మహాదేవ్ బెట్టింగ్ యాప్, బొగ్గు, మద్యం కుంభకోణాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బొగ్గు రవాణా మద్యం వ్యాపారం, మినరల్ ఫౌండేషన్, ధాన్యం మిల్లింగ్, నియామకాల్లో జరిగిన అవినీతిపై అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఎఫ్ఐఆర్లను నమోదు చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టింది. ఈ అవినీతిని బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తోంది. ఈ అవినీతి ఆరోపణలను హస్తం పార్టీ ఖండిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడుతోంది.
అయోధ్య కలిసివస్తుందా?
అయోధ్యలో రామమందిర ప్రారంభం భారతీయ జనతా పార్టీ బాగా కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అయోధ్య వారణాసి తీర్థయాత్రలకు ప్రజలను పంపేందుకు శ్రీ రాంలాలా దర్శన్ యోజనను ప్రారంభించింది. ఇది కమలం పార్టీ విజయావకాశాలను మరింత పెంచింది. ఛత్తీస్‌గఢ్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలను కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో కోల్ బ్లాకుల కేటాయింపుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ వీటిపై నిరసనలు కూడా చేసింది. బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతోందని హస్తం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.
రాష్ట్రంలో బీజేపీకీ ప్రతికూలం!
భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కూడా కమలం పార్టీకి కలిసిరానుంది. కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య విభేదాలు బీజేపీకు సానుకూలంగా మారాయి. సీఎం విష్ణు దేవ్ సాయి ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం రైతులకు ఇన్‌పుట్ సాయం అందిస్తోంది. ఇవి బీజేపీకు బలంగా మారాయి. కేంద్రంలో మోదీ ఉన్నా రాష్ట్రంలో బలమైన, ప్రజాదరణ పొందిన వ్యక్తి లేకపోవడం బీజేపీకు ప్రతికూలంగా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రణదీప్ సూర్జేవాలాపై ఈసీ నిషేధం- హేమమాలినిని అలా అనడమే కారణం - LOK SABHA ELECTIONS 2024