Bangalore North Lok Sabha Constituency : 2004 నుంచి భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న బెంగళూర్ ఉత్తర నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఇక్కడ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి రాజ్యసభ మాజీ ఎంపీ రాజీవ్ గౌడను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. వీరిద్దరూ వక్కళిగ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.
సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవ్వడం వల్ల!
కేంద్రమంత్రి శోభా కరంద్లాజే రెండుసార్లు ఉడిపి-చిక్‌మగళూరు నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే అక్కడ ఆమెకు సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమెకు వ్యతిరేకంగా గో బ్యాక్ శోభా అంటూ సొంతపార్టీ నేతలే నినదించారు. ఈ నేపథ్యంలో ఆమె పోటీ చేసే స్థానాన్ని మార్చిన బీజేపీ, బెంగళూర్ నార్త్ నుంచి బరిలోకి దింపింది.
అభివృద్ధి ప్రధాన అంశంగా!
పదేళ్లుగా ప్రధాని మోదీ హయాంలో జరిగిన అభివృద్ధే ప్రధాన అంశంగా ఆమె ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతిని, సనాతన సంప్రదాయాలను కాపాడే ఎన్నికలు ఇవని ఆమె ఓటర్లకు చెబుతున్నారు. కోస్తా కర్ణాటకకు చెందిన శోభా కరంద్లాజేకు కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప బలమైన మద్దతు ఉంది. కర్ణాటకలో 28కి 28 స్థానాలు బీజేపీ గెలుస్తుందని శోభా కరంద్లాజే ధీమాగా ఉన్నారు.
రెండు సార్లు తప్ప!
బెంగళూర్ నార్త్ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. 1952 నుంచి 2004 వరకు మధ్యలో ఓ రెండేళ్లు మినహా ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎంపీ ప్రాతినిథ్యం వహించారు. 1996 నుంచి 1998 వరకు జనతాదళ్‌కు చెందిన సి.నారాయణస్వామి ఎంపీగా ఉన్నారు. మాజీ రైల్వే మంత్రి సి కె జాఫర్ షరీఫ్ బెంగళూర్ నార్త్ నుంచి ఏకంగా ఏడుసార్లు గెలుపొందారు. అయితే 2004 నుంచి బెంగళూర్ నార్త్ బీజేపీకి కంచుకోటగా మారింది.
కొందరిలో అసంతృప్తి!
కర్ణాటక మాజీ డీజీపీ HT సాంగ్లియానా, దివంగత డీజీ చంద్రేగౌడ, కేంద్ర మాజీ మంత్రి డీవీ సదానంద గౌడ బెంగళూర్ నార్త్ నుంచి బీజేపీ ఎంపీలుగా గెలుపొందారు. వీరందరూ బయటవారే కావడం గమనార్హం. తాజాగా మరో బయట వ్యక్తి కోస్తా కర్ణాటకకు శోభా కరంద్లాజేను బెంగళూర్ నార్త్ నుంచి బీజేపీ బరిలోకి దింపడంపై కొందరు ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఇతర నియోజకవర్గాల్లో తిరస్కరించిన వారిని బీజేపీ ఇక్కడ నుంచి పోటీకి దింపుతోందని వారు ఆరోపిస్తున్నారు.
ఐదు గ్యారెంటీలతో రాజీవ్!
బెంగళూర్ నార్త్ నియోజకవర్గం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఐదుచోట్ల బీజేపీ, మూడు చోట్ల కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాజీవ్ గౌడ లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు. మతపరంగా ప్రజలను విభజించేలా ప్రసంగాలు చేసే శోభా కరంద్లాజేను బెంగళూరు ప్రజలు అంగీకరించరని రాజీవ్ గౌడ చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలను ఆయన ఎక్కువగా ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాహుల్ టు కుమారస్వామి- ఎన్నికల బరిలో PM, CM కుటుంబాలు - lok sabha election 2024