Sleep Divorce Health Benefits: భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకోవడం అనేది శృంగారానికే కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కూడా అవకాశాన్ని కల్పిస్తుందంటారు నిపుణులు. ఇలా కలిసి కాకుండా దంపుతులు విడివిడిగా పడుకుంటే.. వాళ్ల మధ్య బంధం సరిగ్గా లేదని, ఇద్దరూ విడిపోబోతున్నారేమోనని.. ఇలా ఒక్కొక్కరి మనసులో ఒక్కో సందేహం మెదులుతుంది. కానీ అమెరికాలో ఎక్కువ శాతం జంటలు విడిగానే నిద్రిస్తున్నట్లు.. దీని వల్ల పలు ప్రయోజనాలు కూడా పొందుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
సాధారణంగా రోజంతా పనిచేసిన తర్వాత ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారు. అయితే భాగస్వామికున్న కొన్ని అలవాట్ల కారణంగా తోటి భాగస్వామి ఇబ్బంది పడుతుంటారు. అంటే.. గురక పెట్టడం లేదా ఎక్కువ సేపు లైట్లు వేసుకుని మెలకువగా ఉండడం, ఫోన్లు చూడటం మొదలైనవి. ఇలా చేయడం వల్ల నిద్ర సరిగా లేక అటు ఆరోగ్యపరంగా, ఇటు మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే.. ఈ సమస్య నుంచి బయటపడేందుకే అమెరికా, జపాన్‌లోని కొన్ని జంటలు "స్లీప్ డివోర్స్" విధానాన్ని పాటిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
స్లీప్ డివోర్స్ అంటే మంచి నిద్ర కోసం దంపతులిద్దరు వేర్వేరుగా నిద్రించడం. ఉదాహరణకు.. భార్య డే షిఫ్ట్, భర్త నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఇద్దరూ వారాంతాల్లో మాత్రమే ఒకరికొకరు నాణ్యమైన సమయాన్ని ఇవ్వగలుగుతారు. అటువంటి పరిస్థితిలో, ఇద్దరూ విశ్రాంతి తీసుకునేందుకు వారానికి 5 రోజులు స్లీప్ డివోర్స్ విధానాన్ని అలవాటు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చాలా రాత్రులు ప్రశాంతంగా నిద్రించడానికి, ఒకరికొకరు భంగం కలిగించకుండా ఉండటానికి ఉపయోగపడుతుందట.
పరిశోధన వివరాలు: గత ఏడాది.. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్.. USలో 2,005 మంది పెద్దలపై ఆన్‌లైన్ సర్వేను ప్రారంభించింది. ఈ సర్వేలో అమెరికాలో 1/3 వంతు జంటలు ఇలా విడివిడిగానే పడుకుంటున్నట్లు స్పష్టం చేసింది (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). తక్కువ నిద్ర మానసిక స్థితిని మరింత దిగజార్చుతుందని, తమ భాగస్వాములతో వాదించే అవకాశం ఉందని, ఇది సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పల్మోనాలజిస్ట్, AASM(అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్) ప్రతినిధి డాక్టర్ సీమా ఖోస్లా అంటున్నారు. ఆరోగ్యం, ఆనందం రెండింటికీ రాత్రి పూట మంచి నిద్రపోవడం చాలా ముఖ్యమంటున్నారు. కాబట్టి ఈ స్లీప్ డివోర్స్ విధానం అలవాటు చేసుకుంటే మంచిదంటున్నారు.
'స్లీప్ డివోర్స్' ప్రయోజనాలు:
మెరుగైన: ఇది దంపతుల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని.. జంటలు వారి వ్యక్తిగత స్వేచ్ఛను పొందుతారని నిపుణులు అంటున్నారు. మెరుగైన నిద్ర.. శక్తి స్థాయిలను పెంచడానికి దారితీస్తుందని.. ఇది రోజువారీ జీవితం, సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఒత్తిడి: స్లీప్ విడాకులు ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తాయని అంటున్నారు. ఈ విధానం వల్ల జంటలు మరింత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉండేందుకు వీలు దొరుకుతుందని అంటున్నారు.
మెరుగైన బంధం: రోజూ కలిసి పడుకుంటేనే దంపతుల మధ్య అనుబంధం దృఢమవుతుందని భావిస్తుంటారు కొద్దిమంది. అయితే.. ఈ స్లీప్ డివోర్స్ వల్ల కలిసి పడుకోకపోయినా.. రోజూ రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచాక ఒకరికొకరు ఆత్మీయంగా కౌగిలించుకుకోవడం, ప్రేమతో ముద్దులాడటం, వీలున్నప్పుడల్లా కాసేపు కలిసి సమయం గడపడం, రోజూ కలిసే వ్యాయామాలు చేయడం వల్ల బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. ఇక ఈ స్లీప్ డివోర్స్ వల్ల దాంపత్య జీవితం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు.
జీవిత భాగస్వామి దూరంగా ఉన్నారా? - ఇలా దగ్గరైపోండి!
"నా భర్తకు కనీసం బైక్ నడపడం రాదు.. చిన్న పనికి కూడా భయపడతారు - ఏం చేయాలి?"