Laundry Tips for Washing Clothes : కొత్త బట్టలు వేసుకునేటప్పుడు వాటిని అపురూపంగా చూసుకుంటాం. కానీ, రాన్రానూ వాటి విషయంలో శ్రద్ధ తగ్గిపోతుంటుంది. ఫలితంగా కొన్ని రోజులకే దుస్తులు పాతవాటిలా మారిపోతాయి. అందుకు మనం బట్టలు ఉతికేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న పారపాట్లే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. వాటి మూలంగానే దుస్తుల నాణ్యత దెబ్బతిని త్వరగా పాడవుతాయంటున్నారు. ఇంతకీ, ఆ మిస్టేక్స్ ఏంటో.. వాటిని చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- నేటి రోజుల్లో చాలా మంది బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్స్ యూజ్ చేస్తున్నారు. అలాంటి వారు మెషీన్లో దుస్తులు వేసేటప్పుడు జేబుల్లో ఏవైనా వస్తువులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అవి విలువైనవి కాకపోయినా సరే, ఉతికేటప్పుడు తీసేయడం బెటర్ అంటున్నారు నిపుణులు.
- చిల్లర నాణేల వంటి వాటిని దుస్తుల్లో తీయకుండా అలాగే వేస్తే మెషీన్ ఆన్ చేశాక అవి దాని గ్లాస్ డోర్లకు రాసుకుపోయి గీతలు పడతాయి. కేవలం కాయిన్స్ మాత్రమే కాదు జిప్‌లు కూడా వాషింగ్ మెషీన్ డ్యామేజ్ అయ్యేలా చేస్తాయి. అదెలాగంటే.. డ్రస్సుల జిప్పులు పూర్తిగా పెట్టకుండా అందులో వేసేస్తే అవి మెషీన్ అంచులకు తగులుతూనో, లేదా గ్లాస్ డోర్‌కి తగులుతూనో ఉంటాయి.
- బట్టలు ఉతకడానికి ఎంత ఎక్కువ డిటర్జెంట్ యూజ్ చేస్తే అవి అంత శుభ్రంగా మారతాయని భావిస్తారు చాలా మంది. దుస్తులు శుభ్రమవడం అటుంచితే.. మరీ ఎక్కువగా డిటర్జెంట్ వాడటం వల్ల వస్త్రాల పోగులు దెబ్బతింటాయి.
మీకు ఎంతో ఇష్టమైన డ్రెస్ రంగు పోతోందా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుపు తగ్గదు!
- చాలా మంది దుస్తులపై మరకలు పోవాలని బ్లీచ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బ్లీచ్ ఉపయోగించడం వల్ల బట్టలు త్వరగా పాడవుతాయి. అందుకే మరక పోవడానికి సాధ్యమైనంత వరకూ నిమ్మకాయ, సోడా వంటి సహజ పద్ధతులనే యూజ్ చేయాలి.
- దుస్తుల మీద మరకలు పడటం కామన్. ఈ క్రమంలోనే వాటిని పోగొట్టాలని అదే పనిగా రుద్దితే బట్టల మన్నిక దెబ్బతింటుంది. అందుకే.. వీలైనంత వరకు మరక పడిన వెంటనే వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. అప్పుడు కాస్త ఈజీగా పోతాయి. లేకపోతే అవి సులువుగా పోయే పద్ధతులను ఎంచుకోవాలి.
- బట్టలు ఉతికేటప్పుడు రంగుపోయే దుస్తులను మిగిలిన వాటితో కలిపి వాష్ చేయకూడదు. అలా చేస్తే రంగు మిగిలిన వాటికి అంటుకుంటుంది. ఏదైనా క్లాత్ రంగు పోతుందని అనుమానం వస్తే ముందుగా ఆ వస్త్రం ఒక చివర కొద్దిగా తడిపి కలర్ పోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ పోతుంటే ఎక్కువసేపు వాటర్‌లో ఉంచకూడదు. వెంటనే ఉతికి ఆరేయాలి.
- వాషింగ్ మెషీన్‌తో పాటు డ్రైయర్‌ని కూడా క్రమం తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇటు బట్టలు, అటు వాషింగ్ మెషీన్ రెండూ ఎక్కువ రోజులు మన్నుతాయంటున్నారు నిపుణులు.
దుస్తులపై టీ మరకలు పడ్డాయా? - ఇలా క్లీన్ చేస్తే పూర్తిగా తొలగిపోతాయి!