How to Make Perugu Gunta Ponganalu : చాలా మంది ఇళ్లలో ఎప్పుడూ ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ, పెసరట్లేనా.. అంటూ పిల్లలు పేచీ పెట్టడం, తినకుండా మారాం చేయడం చేస్తుంటారు. మీ పిల్లలూ ఇలానే చేస్తున్నారా? అయితే, మీకోసమే ఈ సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "తమిళనాడు స్పెషల్ పెరుగు గుంట పొంగనాలు/పునుగులు". వీటికి కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలే కాదు ఎవరైనా వీటిని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటున్నారు. అంత రుచికరంగా ఉంటాయి! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ పొంగనాల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- వెల్లుల్లి రెబ్బలు - 7
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- పచ్చికొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
- ఎండుమిర్చి - 7
- మినపపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- కందిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- బియ్యం - 1 కప్పు
- పసుపు - అర టీస్పూన్
- ఇంగువ - పావు టీస్పూన్
- పుల్లని పెరుగు - 1 కప్పు
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆయిల్ - తగినంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన మినపపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పుతో పాటు బియ్యాన్నీ చిన్న చిన్న బౌల్స్‌లో వేరువేరుగా ఒక గంటపాటు నానబెట్టుకోవాలి.
- గంటయ్యాక పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చికొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసుకోవాలి.
- తర్వాత అందులోనే నానబెట్టుకున్న పప్పులతో పాటు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. అలాగే.. పసుపు, ఇంగువ, పెరుగు, కరివేపాకు, ఉప్పు వేసుకొని ఇడ్లీ పిండిలా రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
- ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. గుంట పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై గుంట పొంగనాల పాత్ర పెట్టుకొని ప్రతి గుంటలో సగం వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి.
- వాటిల్లో వేసుకున్న నూనె కాస్త వేడి అయ్యాక.. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకుని ఒక్కో దాంట్లో సైడ్ నుంచి పిండి నింపుకుంటూ రావాలి. ఆఖరున మధ్యలో పిండిని నింపుకోవాలి.
- ఈ విధంగా పిండిని తీసుకుంటేనే గుంట పునుగులు చక్కగా కాలుతాయి. అలాగే.. ఇక్కడ మనం పప్పులు ఎక్కువసేపు నానబెట్టుకోలేదు, పిండి ఎక్కువసేపు పులియలేదు కాబట్టి ఈ పొంగనాలు ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుంటాయి.
- అనంతరం తక్కువ మంట మీద రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే తమిళనాడు స్పెషల్ "పెరుగు గుంట పునుగులు" రెడీ!
ఇవీ చదవండి :
రాగులతో ఇలా పునుగులు చేశారంటే - పిల్లలు దుకాణం వైపు పోనేపోరు!
పప్పులు నానబెట్టకుండానే బియ్యంతో "చిట్టి పునుగులు" - టేస్ట్ బండ్లపై దొరికే వాటికి ఏమాత్రం తీసిపోదు!