Raw Coconut Chili Powder at Home : కూరలు రోజూ తినేవాళ్లకు అప్పుడప్పుడూ కమ్మటి కారం పొడితే.. కాస్త నెయ్యి వేసుకుని తినాలనిపిస్తుంది. రుచిని ఆస్వాదించాలని మనసు కోరుకుంటుంది. అయితే.. ఏ కారం పొడి తినాలన్నది పాయింట్. చాలా రకాల పొడులు తయారు చేసుకోవచ్చు. వీటిల్లో దేనికదే ప్రత్యేకం. అన్నీ ఎంతో కమ్మగా ఉండేవే. అయితే.. ఇప్పుడు మాత్రం చాలా మందికి తెలియని పచ్చికొబ్బరి కారం పొడి రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాం.
ఈ పొడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భోజన ప్రియులు ఇష్టంగా లాగించేయొచ్చు. అన్నంలోకి మాత్రమే కాకుండా.. ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫెన్లలోకి కూడా ఈ పొడిని వాడుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. మరి, ఇక ఆలస్యం చేయకుండా సింపుల్‌గా ఈ పచ్చికొబ్బరి కారం పొడి ఎలా చేయాలి ? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓసారి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పచ్చికొబ్బరి ముక్కలు-కప్పు
- పచ్చిశనగపప్పు-2 టేబుల్‌స్పూన్లు
- మినప్పప్పు-టేబుల్‌స్పూన్
- ధనియాలు-టేబుల్‌స్పూన్
- నువ్వులు-టేబుల్‌స్పూన్
- జీలకర్ర-టీస్పూన్
- ఆవాలు -టీస్పూన్
- మెంతులు-టీస్పూన్
- ఎండుమిర్చి-10
- నూనె సరిపడా
- ఉప్పు రుచికి సరిపడా
- కరివేపాకు-2
- చింతపండు-ఉసిరికాయ సైజంత
తాలింపు కోసం..
- ఆవాలు-అరటీస్పూన్
- జీలకర్ర-అరటీస్పూన్
- పచ్చిశనగపప్పు-కొద్దిగా
- మినప్పప్పు-కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు-10
- కరివేపాకు
- ఇంగువ -పావు టీస్పూన్
- పసుపు-చిటికెడు
- తయారీ విధానం :
- ముందుగా స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో 2 టేబుల్స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపండి.
- స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోండి.
- పప్పులు వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. ఇందులో నువ్వులు, కొద్దిగా చింతపండు వేయండి.
- ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
- ఇప్పుడు పప్పులను మిక్సీ గిన్నెలోకి తీసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేయండి.
- ఆ తర్వాత ఇందులోనే పచ్చికొబ్బరి ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో టేబుల్‌స్పూన్ ఆయిల్ వేయండి.
- నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి.
- తాలింపు వేగిన తర్వాత ఇంగువ, పసుపు వేసి కలపండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న కారం పొడి వేసుకుని బాగా మిక్స్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో కమ్మని పచ్చి కొబ్బరి కారం పొడి మీ ముందుంటుంది. నచ్చితే ఈ విధంగా కారం పొడి ఓ సారి ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి:
ఎండు మిర్చితో కారం పొడి రొటీన్ - పచ్చి మిర్చితో ప్రిపేర్ చేసి చూడండి! - అద్దిరిపోయే రుచి మీ సొంతం
టిఫెన్ సెంటర్ స్టైల్ "ఇడ్లీ కారం పొడి" - ఇలా తయారు చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది!