Psychologist Counseling: ఉద్యోగం.. పురుష లక్షణం అని పెద్దలు తరచూ అంటుంటారు. ఆ మాటకు తగ్గట్టుగానే గతంలో భర్త జాబ్ చేస్తే, భార్య ఇంటి బాధ్యతను తీసుకునేది. పురుషులు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లోని మహిళలకు ఇస్తే.. వారు పొదుపుగా ఖర్చు చేసి, మిగిలింది ఆదా చేసేవారు. కానీ నేటి ఆధునిక సమాజంలో స్త్రీ, పురుషులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇలా సంపాదించే భార్యభర్తలలో ఎవరో ఒకరు డబ్బు దుబారా చేయడం సాధారణమే. తాజాగా ఇలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. ఆమె తన సమస్యను పరిష్కరించమని నిపుణుల సలహా కోరుతోంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? దానికి నిపుణులు ఏ విధమైన సలహా ఇచ్చారో ఈ స్టోరీలో చూద్దాం..
ఇదీ సమస్య.. "ఇద్దరం కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాం. జీతాలూ బాగానే వస్తాయి. కానీ, తను డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. డైలీ ఏదో ఒకటి ఆన్‌లైన్లో, ఆఫ్‌లైన్లో కొంటాడు. అలాగే బ్రాండెడ్ దుస్తులూ, చెప్పులూ, ఇతర వస్తువులు.. ఇప్పటికే డజన్ల కొద్దీ ఉన్నా, కొత్తవి కొని ఇంటికి తెస్తాడు. పొదుపు సంగతి గురించి మాట్లాడితే.. "కొంత దాస్తున్నాం కదా..! సంపాదించేది దేనికి" అంటూ మాట దాటవేస్తాడు. తనకు డబ్బు విలువని ఎలా తెలియపరచాలి?" అని ఆ మహిళ సహాయం కోరుతోంది. మరి ఈ సమస్యకు ప్రముఖ సైకాలజిస్ట్ 'డాక్టర్ డి.శోభారాణి' సూచించిన సలహా ఏంటంటే..
సాధారణంగానే భార్యాభర్తలు ఖర్చుపెట్టే అలవాట్లలో కొద్దిగా తేడాలుంటాయి. అయితే పూర్తిగా భిన్న ధృవాలైనప్పుడు మాత్రం ఇది ప్రాబ్లమ్‌గా మారుతుందని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ శోభారాణి అంటున్నారు. కొంతమంది డబ్బు, వాటితో కొనే వస్తువులు హోదానీ, గౌరవాన్నీ పెంచుతాయని భావిస్తారు. కానీ, మరి కొందరు "ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడివరకూ వచ్చాం. ఇకనైనా జాగ్రత్తగా ఉందాం" అని ఆలోచిస్తుంటారు. బాగా డబ్బున్న కుటుంబ నేపథ్యం ఉన్నా, ఆర్థిక క్రమశిక్షణను తల్లిదండ్రుల నుంచి అలవర్చుకున్నవారూ ఉంటారు.
"వస్తువుల్లో ఆనందం చూసేవారికి సేవింగ్స్ గురించి చెబితే చిరాకు, కోపం వస్తాయి. ప్రస్తుతం మీరు ఇద్దరూ సంపాదిస్తున్నారు. కాబట్టి ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి. డబ్బుల విషయంలో చిర్రుబుర్రులాడే బదులు.. చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలి." -డాక్టర్ డి.శోభారాణి
ఇలా చేయండి.. ఉమ్మడి ఆదాయంలో జీవనశైలి ఖర్చుల కోసం కొంత డబ్బు కేటాయించండి. అది మరీ తక్కువ కాకుండా ఆదాయంలో దాదాపు 10 శాతానికి అటూఇటుగా ఉండేలా చూసుకోండి. లేకపోతే, వ్యక్తిగత ఖర్చులపై ఒక నిర్ధిష్టమైన మొత్తాన్ని పెట్టుకుని దాన్ని మించకుండా చూసుకోండి. దీనివల్ల దుబారా సమస్య తలెత్తదు. అలాగే ప్రతినెలలో ఖర్చు పెట్టిన డబ్బు, పొదుపు అమౌంట్ మొత్తాల్నీ ఒకచోట రాసిపెట్టుకోండి. శాలరీ నుంచి ఆ డబ్బుని ముందు పక్కకు పెట్టండి. ఆపైన మిగిలిన డబ్బుతో మీకు నచ్చినవి కొనుక్కునే, లేదంటే దాచిపెట్టే స్వేచ్ఛ తీసుకోండని సలహా ఇస్తున్నారు.
'నా నగలు వీళ్లు తాకట్టు పెట్టారు - వాటిని మా పుట్టింటి వాళ్లు విడిపించాలట!' - ఏం చేయాలి?
'నన్ను పెళ్లి చేసుకున్నాడు - ఇప్పుడు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు' - చట్టం ఎలాంటి సాయం చేస్తుంది??