Rust Prevention Tips for Kitchen Utensils : ప్రతి ఇంట్లో వంటకు అవసరమయ్యే ఇనుప కడాయిలు, స్టీల్ పాత్రలు తప్పకుండా ఉంటాయి. ఇవి లేకుండా కిచెన్‌లో వంట చేయడం అసాధ్యం. అయితే, వర్షాకాలంలో గాలిలో అధిక తేమ కారణంగా కొన్నిసార్లు ఈ పాత్రలు తుప్పుపడుతుంటాయి. వీటిని చూడకుండా అలానే వదిలిస్తే.. కొన్ని రోజులకు గిన్నెలు వంటకు పనికి రాకుండా పోతాయి. అందుకే వర్షాకాలంలో పాత్రలు తుప్పు పట్టకుండా ఉండడానికి కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో మీకు తెలుసా ?
పాత్రలు పొడిగా ఉండేలా చూసుకోండి : గిన్నెలు తుప్పు పట్టడానికి ప్రధాన కారణం తేమ అధికంగా ఉండడమే. ముఖ్యంగా ఐరన్ పాత్రలు లేదా కడాయిలను వర్షాకాలంలో పొడి ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యం. మీరు పాత్రలను ఉపయోగించిన తర్వాత శుభ్రం చేసి, పొడి వస్త్రంతో తుడవండి. ఆ తర్వాత వాటిపై నూనె రాయండి. ఇప్పుడు గిన్నెలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి పొడిగా ఉండే ప్రదేశంలో స్టోర్ చేయండి. ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాత్రలు తుప్పు పట్టకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సిలికా జెల్ ప్యాక్‌లను పెట్టండి : కిచెన్‌లోని రాక్స్‌లో ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులను పెడుతుంటాము కదా..! అవి ఈ వర్షాకాలంలో తుప్పుపట్టకుండా ఉండాలంటే సిలికా జెల్ ప్యాకెట్లను రాక్స్‌లో పెట్టమని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిపై ఎలాంటి తుప్పు పట్టదని చెబుతున్నారు.
అక్కడ పెట్టకండి : ఐరన్ కడాయిలు, దోశ పాన్లను కొంతమంది ఉపయోగించిన తర్వాత తడిగా ఉండేచోట పెడుతుంటారు. అయితే, ఇలా పెట్టడం వల్ల ఈ వర్షాకాలంలో తుప్పు పడుతుంటాయి. కాబట్టి, వాటిని పొడిగా ఉండే చోట పెట్టండి. అలాగే వీటి అవసరం లేకపోతే.. శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఆయిల్ రాసి స్టోర్ చేసుకోవడం మంచిదంటున్నారు.
నిమ్మకాయ, బేకింగ్ సోడా : కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పాత్రలు తుప్పు పడుతుంటాయి. అయితే, ఇలాంటప్పుడు ఆ పాత్రలో టేబుల్‌స్పూన్ బేకింగ్ సోడా, ఒక నిమ్మరసం పిండి స్క్రబ్బర్‌తో రుద్దాలి. బాగా రుద్దిన తర్వాత క్లీన్ చేసి.. ఆయిల్ రాసి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి స్టోర్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే తుప్పు పోవడంతో పాటు, ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయంటున్నారు.
ఈ టిప్స్ పాటించండి :
- వీలైనంత వరకు పాత్రలను శుభ్రం చేసిన తర్వాత తడిగా లేకుండా చూసుకోండి.
- వాటిని కడిగిన తర్వాత పొడి వస్త్రంతో తుడిచి స్టాండ్‌లో పెట్టుకోండి
- అలాగే చాలా రోజుల నుంచి ఉపయోగించని ఏవైనా పాత్రలు ఇంట్లో ఉంటే వాటిని వర్షాకాలంలో బయటకు తీసి ఒకసారి చెక్ చేయండి.
- ఈ టిప్స్ పాటించడం ద్వారా వర్షాకాలంలో వంట పాత్రలు తుప్పు పట్టకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
స్టీల్ గేట్లు, రెయిలింగ్‌పై మరకలా? - ఈ టిప్స్ పాటిస్తే తుప్పు వదిలిపోయి కొత్తగా మెరుస్తాయి!
షవర్ తుప్పు పట్టి వాటర్ సరిగ్గా రావడం లేదా? - ఈ టిప్స్ పాటిస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది!