How to Make Palli Pachi Pulusu : చాలా మందికి పచ్చి పులుసుతో అన్నం తినడం చాలా ఇష్టం. అయితే.. చింతపండుతో (Pachi Pulusu) చేసే పచ్చిపులుసు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ.. పల్లీలతో కూడా "పచ్చిపులుసు" చేస్తారు. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్‌గా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇంతకీ.. పల్లీల పచ్చిపులుసు తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - పల్లీలు
- ఒక కప్పు - చింతపండు రసం
- మూడు - పచ్చిమిర్చి
- ఒక కప్పు - ఉల్లిపాయ ముక్కలు
- అర కప్పు - వెల్లుల్లి రెబ్బలు
- రుచికి సరిపడా - ఉప్పు
- 2 టేబుల్ స్పూన్లు - నూనె
- 1 టేబుల్ స్పూన్ - పోపు దినుసులు
- కొద్దిగా - కరివేపాకు
- కొద్దిగా - కొత్తిమీర తరుగు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే.. ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి పల్లీలను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆపై.. అదే పాన్‌లో పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం.. ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన చింతపండును తీసుకొని కావాల్సిన పరిమాణంలో వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఆ విధంగా రసాన్ని తయారు చేసుకున్నాక.. అందులో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి.
- ఆ తర్వాత.. మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్‌ను చింతపండు రసంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. అలాగే.. తాలింపు చివరలో కరివేపాకు, కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
- తాలింపు బాగా వేగిందనుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చింతపండు రసంలో వేసి కలుపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "పల్లీల పచ్చిపులుసు" రెడీ!
- దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకుని తిన్నారంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది.
- అంతేకాదు.. పల్లీ పచ్చిపులుసు మరీ పల్చగా ఉండదు కాబట్టి.. దీన్ని ఇడ్లీ, ఉప్మాలోకి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది!
ఇవీ చదవండి :
వర్షాకాలంలో "పచ్చి పులుసు" ఇలా చేస్తే - టేస్ట్ గురించి చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే!