CHILLI TAMARIND CHUTNEY : ఏదైనా కర్రీ చేయాలంటే అదో పెద్ద పని. ఇక బిర్యానీ వంటి వంటకాలు చేయాలంటే కనీసం రెండు మూడు గంటలకు పైగా తతంగం ఉంటుంది. అందులో వాడే వస్తువుల లిస్టు చూస్తే చాంతాడంత ఉంటుంది. చేయాల్సి పని కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఆ తర్వాతగానీ రుచిని ఆస్వాదించడం సాధ్యం కాదు. కానీ.. కేవలం పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచిని ఆస్వాదించే వంటకాలు కూడా ఉన్నాయి. అవే రోటి పచ్చళ్లు. అలాంటి వాటిల్లో ఒక స్పెషల్ రెసిపీని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అదే పచ్చిమిర్చి - చింతపండు రోటి పచ్చడి.
ఈ పచ్చడి తయారీలో ఆశ్చర్యపోయే విషయాలు ఏమంటే.. ఇందులో చుక్క కూడా నూనె వాడాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. పొయ్యితో కూడా అవసరం లేకపోవడం మరింత ఆశ్చర్యపడే అంశం. మరి.. నూనె, పొయ్యితో కూడా పనిలేకుండా పచ్చడి ఎలా తయారు చేస్తారు? అసలు ఇందులో ఎలాంటి పదార్థాలు వేస్తారు? టేస్ట్ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
చింతపండు - నిమ్మపండు సైజు
పచ్చిమిర్చి - కారం ఉన్నవి ఐదారు
ఉల్లిపాయ - పెద్ద సైజుది ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - ఐదారు
ఉప్పు - రుచికి తగినంత
కాస్త జీలకర్ర
కొత్తిమీర తరుగు
తయారీ విధానం :
ముందుగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేయండి
ఒక బౌల్ లో నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని.. దాంట్లో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
ఐదారు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసుకొని పక్కన పెట్టుకోండి.
పెద్ద సైజు ఉల్లిపాయను పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు రోట్లో కాస్త జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోండి.
ఆ తర్వాత నానెబట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోండి.
ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసి కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా నూరుకోవాలి.
ఇలా నూరుకున్న పచ్చడిలో కాస్త కొత్తిమీర కలుపుకొని బౌల్ లోకి ఎత్తుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చింతపండు - పచ్చి మిర్చీ పచ్చడి సిద్ధమైపోతుంది.
ఇంతేనండీ.. చుక్క ఆయిల్ కూడా వాడాల్సిన పనిలేకుండా.. పొయ్యితోనే అవసరం లేకుండా అద్దిరిపోయే పచ్చడి రెడీ అయిపోతుంది.
ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటే వావ్ అనాల్సిందే. దీనికి కాస్త నెయ్యి చుక్కను యాడ్ చేసుకుంటే ఇక చెప్పాల్సిన పనిలేదు.
ఇంట్లో రోలు లేనివాళ్లు మిక్సీలో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. కానీ.. రోట్లో నూరుకున్నంత టేస్టీగా ఉండకపోవచ్చు.
ఇవి కూడా చదవండి :
నిగనిగలాడే దొండకాయలతో అద్దిరిపోయే రోటి పచ్చడి - ఇవి కలపండి - అమోఘమైన టేస్ట్ చూస్తారు!
ఉల్లిపాయతో కమ్మటి "రోటి పచ్చడి" - ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!