Legal Advice on Mother Property Rights: పిల్లలు పుట్టలేదని కొందరు.. ఇతర కారణాల వల్ల మరికొంత మంది రెండో పెళ్లి చేసుకుంటుంటారు. ఆ తర్వాత ఇద్దరు భార్యల మధ్య.. వారి వారసుల మధ్య ఆస్తి వివాదాలు చెలరేగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా అలాంటి సంఘటనే. తన తల్లి ఆస్తిని.. తండ్రి మొదటి భార్య దక్కించుకోవాలని చూస్తోందని.. దీనిపై తనకే హక్కులేదని చెబుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఓ మహిళ. ఇంతకీ ఆమె అసలు సమస్య ఏంటి? దీనికి న్యాయ నిపుణులు ఇస్తున్న సలహా ఏంటి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
ఓ వ్యక్తి వివాహం చేసుకోగా చాలా రోజుల వరకు పిల్లలు పుట్టలేదు. దీంతో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో భార్యకు పిల్లలు పుట్టారు. మొదటి భార్యతోపాటు రెండో భార్యాపిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివసించేవారు. అయితే.. ఈ మధ్య కాలంలో అనారోగ్య కారణంతో రెండో భార్య మరణించింది. ఇప్పుడు రెండో భార్య పేరిట ఉన్న ఆస్తులన్నీ తనకే చెందుతాయని మొదటి భార్య చెబుతోంది. దీంతో.. తన తల్లి ఆస్తిపై తనకు హక్కు లేదా అని ప్రశ్నిస్తోంది రెండో భార్య కూతురు. ఈ సమస్యపై న్యాయ నిపుణుల సలహా కోరారు. మరి.. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది వరలక్ష్మి ఎలాంటి సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి వివాహం రద్దు చేసుకోకుండా పిల్లలకోసం రెండో పెళ్లి చేసుకోవడం చట్టబద్ధం కాదు. మీ తల్లిగారి ఆస్తి ఆవిడ పేరిట ఉంటే దానికి భర్త, పిల్లలు తప్పనిసరిగా వారసులు అవుతారు. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం హిందూ మహిళకు... వారసత్వంగా వచ్చిన ఆస్తి లేదా, సొంతంగా సంపాదించినదీ, భాగస్వామ్యంతో వచ్చినదీ, భరణం, మహిళాధనం, పెళ్లప్పుడు వచ్చిన కానుకలు... ఇలా ఇవన్నీ కూడా ఆమె స్వార్జితంగానే పరిగణిస్తారు. ఆవిడ బతికి ఉండగా వాటిని తనకు ఇష్టమైన వ్యక్తులకు ఇచ్చుకునే హక్కు ఉంటుంది.
- వరలక్ష్మి, న్యాయ నిపుణులు
ఒకవేళ ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే.. మరొక పరిష్కార మార్గం ఉంటుందని వరలక్ష్మి చెబుతున్నారు. "మీ తల్లి ఎలాంటి వీలునామా రాయకుండా కనుక మరణిస్తే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్- 13 ప్రకారం పిల్లలకు (కూతుళ్లు, కొడుకులు) లేదా వారి వారసులకు, భర్తకూ ఈ ఆస్తులన్నీ చెందుతాయి. అయితే.. మీ నాన్నగారు చేసుకున్న పెళ్లి చెల్లదు కాబట్టి ఆయన్ని వారసుడిగా పరిగణించలేము. ఒకవేళ పిల్లలు, భర్త ఇలా ఎవరూ లేకపోతే ఆ ఆస్తులు ఎవరి తరఫు నుంచి వచ్చాయో, వారి వారసులకి దక్కుతాయి. ఇక, మిమ్మల్ని మీ అమ్మగారికి వారసురాళ్లుగా గుర్తించాలంటే మాత్రం తప్పనిసరిగా వారసత్వ ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుంది. అందుకోసం న్యాయస్థానానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అది ఉంటే మిగిలినవన్నీ పూర్తి చేసుకోవచ్చు. తొందరగా ప్రయత్నించండి." అని వరలక్ష్మి సలహా ఇస్తున్నారు.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.