Instant Breakfast Recipe in Telugu: డైలీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, చపాతీ.. వంటి టిఫెన్స్ ప్రిపేర్ చేసుకుంటుంటాం. అయితే, కొన్ని సందర్భాల్లో అలాంటి టిఫెన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇంట్లో ఉండవు. ఒకవేళ ఉన్నా.. వాటిని తయారు చేసుకోవడానికి కావాల్సినంత టైమ్ ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో.. ఈ ఇన్స్టంట్ ఊతప్పం రెసిపీని ట్రై చేయండి. కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు! ఇంతకీ, దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- బంగాళ దుంపలు - 2(మీడియం సైజ్‌వి)
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ - 1(మీడియం సైజ్)
- క్యారెట్లు - 2(మీడియం సైజ్)
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
- ఆయిల్ - కొద్దిగా(కాల్చుకోవడానికి)
తెల్ల ఇడ్లీతో షుగర్ సమస్యా! - చక్కటి ఆరోగ్యాన్ని అందించే రాగి ఇడ్లీ - ఇలా ప్రిపేర్ చేసుకోండి!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన బంగాళదుంపలను పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక నీళ్లలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అలాగే.. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నని తరుగులా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీరను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి. క్యారెట్స్‌ను కూడా సన్నని తరుములా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకొని మెత్తగా అవ్వడానికి రెండుసార్లు అలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలను వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మెత్తని మిశ్రమంలా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, కట్ చేసుకొని పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగుతో పాటు సన్నని క్యారెట్ తురుమూ వేసుకొని అన్నీ కలిసేలా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆవిధంగా ప్రిపేర్ చేసుకున్నాక.. అందులో బేకింగ్ పౌడర్ వేసుకొని దానిపై రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆపై వెంటనే ఈ పిండితో బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవాలి.
- అందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక కలిపిపెట్టుకున్న మిశ్రమం నుంచి పాన్‌కి తగినట్లుగా పిండిని తీసుకొని ఊతప్పంలా వేసుకోవాలి.
- ఆపై మూతపెట్టి స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి ఒకవైపు చక్కగా కాలనివ్వాలి. వన్‌సైడ్ మంచిగా కాలాక గరిటెతో టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "ఇన్స్టంట్ ఊతప్పం" రెడీ!
- తర్వాత వీటిని ఇంట్లో ఉన్న ఊరగాయతో కలిపి తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది!
పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పనే లేదు - ఈ పదార్థాలతో నిమిషాల్లో అతి మృదువైన ఇడ్లీలు రెడీ!