Hair Dye Stains Remove Tips: సాధారణంగా మనం తలకు రంగు వేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా వేసినా సరే.. నుదురు, మెడ ప్రాంతాల్లో తప్పకుండా డై మచ్చలు పడుతుంటాయి. వీటిని ఎంత క్లీన్ చేసినా అంత తొందరగా వదలవు. దాంతో చూసే వారికి జుట్టుకు హెయిర్ డై వేసుకున్నట్లు తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా అవి అలాగే ఉండిపోతాయి. అలాంటి సమయంలో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మచ్చలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో తెలుసుకుందాం పదండి.
మేకప్ రిమూవర్: హెయిర్ డై వేసుకునే క్రమంలో చర్మంపై పడిన మచ్చల్ని తొలగించడానికి మేకప్ రిమూవర్, నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం కొద్దిగా మేకప్ రిమూవర్‌ను చిన్న కాటన్ బాల్‌పై వేసి మచ్చ పడిన చోట ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా రుద్దితే మచ్చ తొలగిపోతుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఉపయోగించే రిమూవర్ ఆల్కహాల్ లాంటిది అయితే మాత్రం దాన్ని ఉపయోగించాక అక్కడ మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
నెయిల్ పాలిష్ రిమూవర్: ఇదే కాకుండా నెయిల్ పాలిష్ రిమూవర్‌తో కూడా మచ్చలు పోయేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చుక్కల నెయిల్ పాలిష్ రిమూవర్‌ను కాటన్ బాల్‌పై వేసి మచ్చ పడిన చోట కాస్త గట్టిగా రుద్దాలి. అనంతరం గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మచ్చలు తొలగిపోతాయని తెలుపుతున్నారు. అయితే నెయిల్ పాలిష్ రిమూవర్ చర్మంపై ఎక్కువ సమయం ఉండకుండా జాగ్రత్తపడాలని.. ఎందుకంటే ఇది ఎక్కువసేపు చర్మంపై ఉండడం వల్ల చర్మం పొడిబారిపోతుందని పేర్కొన్నారు. అలాగే దీన్ని కళ్లకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని సలహా ఇస్తున్నారు.
బేకింగ్ సోడా: ఫేషియల్స్, స్క్రబ్స్ తయారీలో వాడే బేకింగ్ సోడాతో కూడా హెయిర్ డై వల్ల చర్మంపై పడిన మచ్చల్ని సులభంగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం బేకింగ్ సోడా, డిష్‌వాషింగ్ లిక్విడ్‌లను ఒకే మోతాదులో తీసుకొని మిశ్రమంలా తయారుచేసుకోవాలని తెలిపారు. దీన్ని మచ్చ పడిన చోట అప్లై చేసి చేత్తో లేదంటే కాటన్ ప్యాడ్‌తో నెమ్మదిగా రుద్దాలని చెప్పారు. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేస్తే మచ్చ తొలగిపోతుందని వివరిస్తున్నారు. ఈ మిశ్రమం వల్ల చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు.
టూత్‌పేస్ట్: హెయిర్ డై వల్ల చర్మంపై పడిన మచ్చల్ని టూత్‌పేస్ట్ సులభంగా తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం జెల్ లేదా టూత్‌పేస్ట్‌ను కొద్దిగా తీసుకొని దాన్ని మచ్చ పడిన అప్లై చేయాలట. ఆపై కాటన్ ప్యాడ్ లేదా సాఫ్ట్ టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా పది నిమిషాల పాటు రుద్దాలని చెప్పారు. ఆ తర్వాత గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్ బట్టతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తే మచ్చ తొలగిపోతుందని వివరిస్తున్నారు.
పెట్రోలియం జెల్లీ: పెట్రోలియం జెల్లీ.. చర్మంపై హెయిర్ డై మచ్చలు పడకుండా కాపాడడం మాత్రమే కాకుండా.. పడిన వాటిని తొలగించడంలోనూ సహాయపడుతుందని అంటున్నారు. దీనికోసం కాస్త పెట్రోలియం జెల్లీని మచ్చ పడిన చోట రాసి రుద్దాలని చెబుతున్నారు. ఇలా చేయగానే జెల్లీ డై రంగులో మారుతుందని.. ఇలా ఇది పూర్తిగా డై రంగులోకి వచ్చిన తర్వాత గోరువెచ్చటి నీటిలో ముంచి పిండిన కాటన్ వస్త్రంతో దాన్ని తుడిచేయగానే మచ్చలు పోతాయని తెలుపుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్ - ఏ గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయో మీకు తెలుసా? - Brown Vs White Eggs
మీ శరీరం నుంచి "బ్యాడ్ స్మెల్" వస్తోందా? - దీనికి కారణం ఏంటో తెలుసా? - BODY ODOUR CAUSES