Special Rice Gravy Chicken Fry Recipe: సాధారణంగా మెజారిటీ ఇళ్లలో ప్రతీ సండే చికెన్ ఉంటుంది. అయితే.. చాలా మంది రొటీన్ స్టైల్లో చికెన్ వండుతారు. అందుకే.. ఈ స్పెషల్ వెరైటీ రెసిపీని మీరూ ఓ సారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కేజీ చికెన్
- రుచికి సరిపడా ఉప్పు
- 2 టేబుల్ స్పూన్ల కారం
- పావు టీ స్పూన్ పసుపు
- అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
- 2 టీ స్పూన్ల వేయించిన ధనియాల పొడి
- ఒక టీ స్పూన్ గరం మసాలా
- పావు టీ స్పూన్ మిరియాల పొడి
- ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 3 ఉల్లిపాయ ముక్కలు
- 10 పచ్చిమిరపకాయలు
- కొద్దిగా కరివేపాకు
- కొద్దిగా కొత్తిమీర
- కొద్దిగా పుదీనా
- అర చెక్క నిమ్మరసం
- ఒక స్పూన్ కసూరి మెతి
- అర కప్పు పెరుగు
- నూనె
తయారీ విధానం..
- ముందుగా చికెన్‌ను శుభ్రం చేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, కసూరి మెతి, పెరుగు వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమంపై మూత పెట్టి సుమారు అర గంటపాటు పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి మిగిలిన ఉల్లిపాయలను నూనెలో ఫ్రై చేసుకుని కొన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- మరో గిన్నెను తీసుకుని అందులో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక మసాలా పట్టించిన చికెన్‌ను వేసి హై-ఫ్లేమ్‌లో 5 నిమిషాలపాటు కలుపుతూ వేయించుకోవాలి.
- ఆ తర్వాత దీనిపై మూత పెట్టి మరో 15 నిమిషాల పాటులో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. (మధ్యలో ప్రతీ 5 నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి)
- ఇప్పుడు కరివేపాకు, ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం, కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా కలిపి 3 నిమిషాలు ఉడికించుకుని దించేసుకోవాలి.
స్పెషల్ రైస్‌కు కావాల్సిన పదార్థాలు
- 3 కప్పుల బాస్మతి బియ్యం
- 4 టమాటాలు
- వేయించిన ఉల్లిపాయ ముక్కలు
- కొద్దిగా కొత్తిమీర పుదీనా
- పచ్చిమిరపకాయలు
- 3 టేబుల్ స్పూన్ల నూనె
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
- 6 పచ్చిమిరపకాయలు
- ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- రుచికి సరిపడా కారం
- ఒక టేబుల్ స్పూన్ కారం
- ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా
- అర చెక్క నిమ్మరసం
తయారీ విధానం..
- ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు పక్కకు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో 4 టమాటాలు, నీళ్లుపోసి 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఉడకబెట్టుకున్న టమాటాలు, ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు అదే స్టౌ పై ఓ గిన్నె పెట్టుకుని నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి.
- ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి.
- ఇందులో ఉప్పు, కారం, బిర్యానీ మసాలా వేసి నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత నాలుగున్నర కప్పుల నీళ్లు, నిమ్మరసం పోసి మరిగించుకోవాలి.
- నీళ్లు మరిగాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకుని నెమ్మదిగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- అనంతరం మూత తీసి అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా కలిపి కొద్దిగా నూనె పోసి.. ఆ తర్వాత స్టౌపై పెనం పెట్టి దానిపై ఈ గిన్నె పెట్టి దమ్ ఇవ్వాలి.
- ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి సుమారు 15 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టౌ ఆఫ్ చేసి మూతపెట్టి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి.