Rusk Halwa Recipe in Telugu: చాలా మందికి అన్నం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. అయితే, స్వీటులో ఎన్ని రకాలు ఉన్నా.. అందులో హల్వాది మాత్రం ప్రత్యేక స్థానం. ఈ నోరూరించే స్వీట్ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇలా మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా హల్వాను ట్రై చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా "రస్క్ హల్వా" టేస్ట్ చేశారా?
చూడడానికి దాదాపుగా బ్రెడ్ హల్వాలాగానే కనిపించినా.. కానీ టేస్ట్ మాత్రం వెరైటీగా ఉంటుంది. ఇంకా బ్రెడ్ హల్వా మాదిరిగా నూనెలు, నెయ్యిలు ఎక్కువగా పోయాల్సిన అవసరం ఉండదు. ఈ స్వీట్‌ను ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. పైగా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ రస్క్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కప్పు రస్క్ పొడి (10 రస్క్‌లు)
- 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష
- పిడికెడు జీడిపప్పులు
- 3 టేబుల్ స్పూన్ల నెయ్యి
- ఒక కప్పు పంచదార
- 2 దంచిన యాలకులు
- చిటికెడు కుంకుమ పువ్వు
తయారీ విధానం
- ముందుగా రస్క్‌లను తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని దంచుకోవాలి. వీలుకాకపోతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. (మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా ఉండేలా చేసుకోవాలి.)
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి నెయ్యి వేసుకుని వేడిచేసుకోవాలి.
- ఆ తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- అనంతరం మరికొంత నెయ్యి వేసి రస్క్ పొడి వేసి ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. (లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుని వేయించుకోవాలి)
- ఇప్పుడు అదే గిన్నెలో పంచదార, ఒకటిన్నర కప్పుల నీరు పోసి మరిగించాలి.
- ఇందులోనే దంచిన యాలకులు, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. (కుంకుమ పువ్వు వేయడం వల్ల ఫ్లేవర్‌తో పాటు రంగు వస్తుంది)
- పాకం మరిగిన తర్వాత ఇందులో పొడి చేసుకున్న రస్క్ మిశ్రమాన్ని పోసుకుని బాగా కలపాలి.
- దించబోయే ముందు వేయించుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసి కలిపేసుకుంటే టేస్టీ రస్క్ హల్వా రెడీ!