Kakarakaya Ulli Karam in Telugu: కాకరకాయ అనగానే మనలో చాలా మంది చేదు అంటూ ముఖం తిప్పేసుకుంటారు. ఇంట్లో కాకరకాయ కూర చేశారంటే ఆ రోజు దాన్ని ముట్టకోకుండా ఉపవాసం చేసేవారు ఉంటారు. కానీ, చేదుగా ఉండే కాకరకాయలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. అయినప్పటికీ తినరు. మీ ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఈసారి కాకరకాయ-ఉల్లికారం రెసిపీ ప్రిపేర్ చేయండి. దీనిని వేడి వేడి అన్నం, పప్పు చారు, రసం ఇలా దేనితోనైనా తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 3 టీ స్పూన్ల శనగపప్పు
- 3 టీ స్పూన్ల ధనియాలు
- 2 టీ స్పూన్ల జీలకర్ర
- 15 వెల్లుల్లి రెబ్బలు
- ఉసిరి కాయంత చింతపండు
- కొద్దిగా కరివేపాకు
- 3 టీ స్పూన్ల కారం
- అర టీ స్పూన్ కల్లుప్పు
- పావు టీ స్పూన్ ఇంగువా
- ఒక టీ స్పూన్ బెల్లం
- ఒక కిలో కాకరకాయలు
- ఒక టీ స్పూన్ ఉప్పు
- ఒక టీ స్పూన్ పసుపు
- నూనె
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ పాన్‌లో 2 టీ స్పూన్ల నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇందులో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిని మిక్సీలో వేసి కారం, కల్లుప్పు, ఇంగువా, బెల్లం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం కాకరకాయలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్‌లో రౌండ్‌గా ముక్కలు కట్ చేసుకోవాలి.
- ఈ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక మిక్స్ చేసుకున్న కాకరకాయలను ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలి. (మధ్యమధ్యలో మిక్స్ చేస్తూ సుమారు 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని కలపాలి)
- ఇప్పుడు ముందుగానే చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మరోసారి కలపాలి. (ఇలా చేయడం వల్ల కారం, కాకరకాయలు బాగా కలిసిపోతాయి)
- ఇలా స్టౌ లో-ఫ్లేమ్‌లో పెట్టుకుని సుమారు 5 నిమిషాలపాటు వేయించుకుని దించేసుకుంటే టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ!