How to Prepare Beetroot Chapati in Telugu : మనలో చాలా మందికి ముఖ్యంగా మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఐరన్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే.. బలహీనపడి అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి వారు పాలు, బీట్రూట్ వంటివి తీసుకోవాలని వైద్యులు సైతం సలహా ఇస్తుంటారు. కానీ.. చాలా మంది బీట్రూట్ తినడానికి ఇబ్బంది పడుతుంటారు. జ్యూస్ తాగడాన్ని కూడా ఇష్టపడరు. ఇలాంటివారికి చక్కటి ఆప్షన్ బీట్రూట్ చపాతీ!
బీట్రూట్ చపాతీ చేసుకోవడం వల్ల.. అదంటే ఇష్టంలేని వాళ్లు కూడా ఇష్టంగా తినేస్తారు. దీనిని తినడం వల్ల రుచితోపాటు.. అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం అవుతాయి. అంతేకాదు.. ఈ బీట్ రూట్ చపాతీని తయారు చేసుకోవడం పెద్దగా ఇబ్బంది కూడా కాదు. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఈ బీట్రూట్ చపాతీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కప్పు బీట్రూట్ తురుము
- కొద్దిగా కొత్తిమీర
- ఒక కప్పు గోధుమ పిండి
- రుచికి సరిపడా ఉప్పు
- నూనె
తయారీ విధానం..
- ముందుగా ఓ గిన్నెలో బీట్రూట్ తురుము, ఉప్పు, కొత్తిమీర, గోధుమ పిండి వేసి కలపాలి. మీకు కారంగా కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, మిరియాల పొడి వేసుకోవచ్చు.
- ఇప్పుడు అవసరమైన మేర కొద్దిగా నీటిని కలుపుతూ రొట్టెలకు సరిపోయేలా పిండిని కలుపుకోవాలి. పిండి కలిపే విధానంపైనే చపాతీ టేస్ట్ ఆధారపడుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి.
- అనంతరం వీటిని రొట్టెలు చేసుకునేందుకు వీలుగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. అంటే.. చపాతీ ముద్దల మాదిరిగా చేసుకోవాలి.
- ఆ తర్వాత పీటను తీసుకుని దానిపై కాస్త పొడి పిండిని చల్లుకుని పిండి ముద్దలను రొట్టెలాగా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పెనంపై రొట్టెను వేసి దానిపై నూనె వేసి కాల్చాలి.
- ఇలా రెండు వైపులా నూనెను వేస్తూ బాగా కాల్చుకోవాలి.
- అంతే.. ఎంతో హెల్దీ బీట్రూట్ చపాతీ రెడీ అయిపోతుంది.
- ఇది సాధారణ చపాతీకన్నా ఎంతో మేలైనది. చపాతీలో కేవలం గోధుమ పిండి బెనిఫిట్స్ మాత్రమే లభిస్తాయి. కానీ.. బీట్ రూట్ చపాతీలో పుష్కలంగా ఐరన్ కూడా లభిస్తుంది.
- సో.. మీకు నచ్చితే ఈ రోజే తయారు చేసేయండి.