How to Make Vamaku Rice in Telugu : చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటివాటికి వామాకు చక్కగా పని చేస్తుంది. ఈ ఆకుల వాసన పీలిస్తే జలుబు తగ్గిపోతుంది. అలాగే కఫంతో బాధపడుతున్న వారు.. గ్లాసుడు నీళ్లలో రెండు వామాకులను మరిగించి వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. వామాకులను 'మదర్ ఆఫ్ హెర్బ్స్ అనీ, ఇండియన్ థైమ్' అని కూడా అంటారు. ఆకుపచ్చ రంగులో దళసరిగా చూడచక్కగా ఉండే ఈ వామాకుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ మొక్కని కొంతమంది ఇంటి ఆవరణలో పెంచుకుంటుంటారు.
ఇక చాలా మంది వామాకులతో కూరలు, పచ్చడి, రసం వంటివి చేస్తుంటారు. అలాగే కొంతమంది వామాకులతో బజ్జీలు కూడా చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ అవే కాకుండా.. వామాకులతో ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. పిల్లల లంచ్ బాక్స్ కోసం కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేయవచ్చు. పైగా ఈ వామాకు అన్నం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రైస్ తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నోరూరించే వామాకు అన్నం ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- అన్నం-కప్పు
- నూనె-టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు-5
- మిరియాల పొడి- పావు టీస్పూన్
- వామాకులు- పది
- ఎండుమిర్చి-3
- కరివేపాకు-2
- కొత్తిమీర-కొద్దిగా
- పసుపు-కొద్దిగా
- ఉప్పు- తగినంత
తయారీ విధానం :
- ముందుగా వామాకులను నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటిని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ పై కడాయి పెట్టి ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించండి.
- ఇప్పుడు సన్నగా తరిగిన వామాకులను వేసి వేపండి. వామాకులు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి.
- ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కలపండి.
- తర్వాత పొడిపొడిగా వండుకున్న అన్నం వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే కొత్తిమీర వేసి కలపండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 5 నిమిషాలు అలా వదిలేయండి.
- అంతే తర్వాత స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ఎంతో రుచికరంగా ఉండే వామాకు అన్నం రెడీ. నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఇంట్లో రైస్ ప్రిపేర్ చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
మీ పిల్లలు కరివేపాకు తినడం లేదా? - ఇలా రైస్ చేసి పెడితే మెతుకు మిగల్చరు - పైగా ఆరోగ్యం కూడా!
పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ "ఆమ్లా రైస్" - ఇలా చేశారంటే మెతుకు మిగలదు!