How to Make Mirchi Masala Fry in Telugu: మిర్చి బజ్జీ.. చాలా మంది ఫేవరెట్ స్నాక్. ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నా మెజార్టీ పీపుల్ వీటిని తినడానికే ఇష్టపడతారు. ఎందుకంటే టేస్టీగా, స్పైసీగా ఉండి తినగానే నోట్లో నీరూరుతుంది. అయితే మిరపకాయతో ఒక్క బజ్జీలు మాత్రమే కాదు.. ఎన్నో రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. అందులో మిర్చి మసాలా ఫ్రై ఒకటి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలోకి డైరెక్ట్‌గా కలుపుకుని తిన్నా లేదా పప్పు, సాంబార్ వంటి వాటిల్లోకి సైడ్ డిష్‌గా కూడా అద్దిరిపోతుంది. పైగా దీనిని ప్రిపేర్ చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం నిమిషాల్లోనే సూపర్ టేస్ట్‌తో తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మసాలా మిర్చి ఫ్రై కి కావాల్సిన పదార్థాలు:
- బజ్జీ మిరపకాయలు - పావు కిలో
- శనగపిండి - అర కప్పు
- పసుపు - అర టీ స్పూన్
- కారం - 2 టీ స్పూన్లు
- ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
- ఆమ్చూర్ పొడి - 2 టీ స్పూన్లు
- గరం మసాలా - అర టీ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- కసూరీ మేథీ - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆయిల్ - 4 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - అర టీ స్పూన్
- వెల్లుల్లు రెబ్బలు - 4
- నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
- ముందుగా బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి నీళ్ల తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలను శుభ్రం చేసుకోవాలి.
- ఇప్పుడు బజ్జీ మిరపకాయ మధ్యలో గాటు పెట్టుకుని అందులోని గింజలను తీసేసుకోవాలి. ఒకవేళ స్పైసీగా తినాలనుకునేవారు గింజలను ఉంచేసిన పర్లేదు. ఇలా అన్ని మిరపకాయలను ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి శనగపిండి వేసుకుని మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత గ్యాస్‌ను సిమ్‌లో పెట్టి పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, కసూరీ మేథీ, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలను ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఆమ్చూర్ పొడి లేకపోతే దాని ప్లేస్‌లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. అయితే ఈ నిమ్మరసాన్ని పాన్‌లో కలుపుకోకుండా శనగపిండి మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వేసుకుని కలుపుకోవాలి.
- ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ను కట్ చేసిన మిర్చి బజ్జీల్లో పెట్టుకోవాలి. ఇలా అన్నింటిలో శనగపిండి మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టఫ్ చేసుకున్న బజ్జీ మిరపకాయలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి.
- ఇలా ఒకవైపు మిర్చి మెత్తగా అయిన తర్వాత స్పూన్ సాయంతో మిరపకాయలను మరోవైపు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో మిరపకాయలను మెత్తగా ఉడికించకూడదు. కొద్దిగా ఫ్రై అయితే చాలు.
- ఆ తర్వాత మిగిలిన శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని చిన్నగా కలపుతూ బజ్జీ మిరపకాయలను కలుపుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిగిలిన నిమ్మరసాన్ని వేసి కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మిర్చి ఫ్రై రెడీ!!
గుంత పొంగనాల కోసం పిండి ఎందుకు గురూ? - వీటితో క్షణాల్లో చేసేయండి - టేస్ట్ ఎంజాయ్ చేయండి
ఎప్పుడూ పానీపూరీ, పునుగులేనా? - ఈ సారి "మటర్ కుల్చా" ట్రై చేయండి - అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్!