How to Make Hotel Style Ginger Tea : "పొయ్యిమీద పాలు కాగుతుంటాయి. కాసేపటి తర్వాత అందులో టీపొడి, చక్కెర వేస్తారు. మరికాసేపు మరిగిన తర్వాత దించేస్తారు. కప్పుల్లో వడకట్టి ఆస్వాదిస్తుంటారు." 90 శాతం ఇళ్లలో చాయ్ ఇలాగే తయారు చేస్తారు. అయితే.. ఎప్పుడైనా బయట అల్లం చాయ్ తాగితే.. ఆ ఫ్లేవర్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. "ఆహా.. భలేగా ఉంది" అనిపించి, ఇంటికి వచ్చిన తర్వాత అదే చాయ్ ప్రిపేర్ చేస్తే మాత్రం.. ఆ టేస్ట్ రాదు! దీనికి కొన్ని టిప్స్ పాటించకపోవడమే అంటున్నారు నిపుణులు! అవేంటో ఇప్పుడు చూద్దాం.
అల్లం చాయ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు అల్లం టీ తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అయితే.. అల్లం టీ తయారు చేయడం అంటే.. పాలలో టీపొడి, అల్లం వేసేయడమే అనుకుంటారు చాలా మంది. అలాగే తయారు చేస్తుంటారు కూడా. అందుకే.. చాయ్ అనుకున్నంత ఫ్లేవర్‌గా ఉండదు! ముందుగా పాలు వేడి చేసి, అవి కాస్త మరిగిన తర్వాత టీ పౌడర్ వేయాలి. టీపొడి కూడా మరిగి, అందులోని సారం మొత్తం పాలలో కలిసిపోయిన తర్వాత పంచదార వేయాలి. మరికాసేపటి తర్వాతే అల్లం వేయాలి.
తురుముకోండి..
అల్లం మూడ్నాలుగు పెద్ద సైజు ముక్కలుగా చేసి వేస్తుంటారు కొందరు. కానీ.. అలా చేయకూడదు. పెద్ద ముక్కలు వేయడం వల్ల అల్లంలోని సారం పూర్తిగా చాయ్‌లోకి దిగదు. అందుకే.. అల్లాన్ని సన్నగా తురుముకోవాలి. ఈ తురుము వేసిన తర్వాత.. చాయ్‌ని మరో 5 నిమిషాలపాటు మరిగించాలి. ఇలా.. పద్ధతి ప్రకారం చేస్తేనే టీ రంగు, రుచి, వాసన పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా తయారైన చాయ్‌ని తాగితే.. ఎంతో మధురంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఎప్పుడు తాగాలి?
దాదాపుగా అందరూ ఉదయం లేచిన తర్వాత ఎలాంటి ఆహారమూ తీసుకోకుండానే.. టీ, కాఫీ తాగుతుంటారు. కానీ.. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తాగడం వల్ల పేగులపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్ట్రబుల్, అజీర్తి ప్రాబ్లమ్స్ వస్తాయని అలర్ట్ చేస్తున్నారు.
"జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం"లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ ప్రకారం.. ఏదైనా ఫుడ్ తిని చాయ్ తాగిన వారి కంటే.. ఖాళీ కడుపుతో చాయ్ తాగిన వారిలో ఎక్కువగా కడుపు నొప్పి, అజీర్ణం, వికారం కనిపించాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాకు చెందిన జాంగ్ యున్‌షియో పాల్గొన్నారు. మార్నింగ్ ఉదయాన్నే టీ తాగడం వల్ల అందులోని యాసిడ్లు కడుపులోని పొరకు ఇబ్బంది కలిగించి, జీర్ణ సమస్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ పెరుగుతుందని, ఇది శరీరంలో ప్రమాదకర సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో పెప్టిక్ అల్సర్, క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. దంతాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే.. తిన్న తర్వాత చాయ్ తాగడం మంచిదని సూచిస్తున్నారు.