How to Make Egg Uggani Recipe : రాయలసీమ స్టైల్లో.. వారు చేసే కొన్ని ప్రత్యేకమైన వంటకాల్లో ఉగ్గాని కూడా ఒకటి. అక్కడి వారు చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో ఉగ్గాని బజ్జీలతో కలిపి తినడానికి ఇష్టపడుతుంటారు. వేడివేడి మిర్చి బజ్జీలతో ఉగ్గాని కలిపి తింటుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే.. ఇప్పుడు మనం రాయలసీమ స్టైల్లో ఎంతో రుచికరమైన "ఎగ్ ఉగ్గాని" ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఎగ్ ఉగ్గాని చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఎగ్ ఉగ్గాని చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- మరమరాలు-200 గ్రాములు
- నూనె-2టేబుల్‌స్పూన్లు
- టమాటాలు-2
- ఉల్లిపాయలు-2
- గుడ్లు-3
- పసుపు-చిటికెడు
- ఉప్పు -రుచికి సరపడా
- ఆవాలు-అర టీస్పూన్
- జీలకర్ర-అర టీస్పూన్
- శనగపప్పు-టీస్పూన్
- పచ్చిమిర్చి-3
- ఎండుమిర్చి-2
- కరివేపాకు-2
- కొత్తిమీర కొద్దిగా
- పప్పులపొడి-3 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం..
- ముందుగా మరమరాలను నీటిలో నానబెట్టుకోవాలి.
- రెండు నిమిషాల తర్వాత చేతితో మరమరాలను పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరమరాలను ఎక్కువ సేపు నీటిలో ఉంచకూడదు. ఎందుకంటే సాఫ్ట్‌గా మారిపోతాయి.
- తర్వాత స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయండి.
- ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేయండి.
- అవి కాస్త వేగిన తర్వాత.. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై చేయాలి.
- ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకుని కలపండి.
- టమాటా ముక్కలు సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇందులో కోడి గుడ్లు పగలగొట్టి వేయండి. కాసేపు ఎగ్స్ వేగనివ్వండి
- ఆ తర్వాత మరమరాలను అందులో వేసి బాగా కలుపుకోండి. అలాగే పప్పుల పొడి కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి.
- కుక్ అయిపోయిందనుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. దానికి ముందు కొత్తిమీర చల్లుకోండి.
- ఇంతే.. ఇలా సింపుల్‌గా చేసుకుంటే టేస్టీ ఎగ్ ఉగ్గాని రెడీ.
- ఇంట్లో టిఫెన్ చేయడానికి ఇడ్లీ, దోశ పిండి లేనప్పుడు క్షణాల్లో తయారయ్యే ఈ ఉగ్గాని ట్రై చేయండి. ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
- నచ్చితే మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి.
- పిల్లలకు ఈవెనింగ్ స్నాక్‌గా ఈ రెసిపీ చాలా బాగా సెట్ అవుతుంది. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
ఇవి కూడా చదవండి :
పిండి రుబ్బకుండానే టేస్టీ దోశలు - ఇలా ప్రిపేర్ చేస్తే నిమిషాల్లో రెడీ!