How To Make Beerakaya Thokku Pachadi : మనం రోజు వంట చేసే సమయంలో పలు కాయగూరల తొక్కు తీసేస్తుంటాం. ఆ తర్వాతే వండుకుంటాం. కానీ.. కొన్ని కూరగాయల పొట్టులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే.. అలాంటి వాటిని తినాలని సూచిస్తుంటారు. అలాంటి వాటిల్లో బీరకాయ పొట్టు ఒకటి. బీరకాయ లోపల ఎన్ని పోషకాలు ఉంటాయో.. తొక్కలోనూ అంతే ఉంటాయట. మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య పోషకాలు ఇందులో ఉంటాయట. అలాంటి బీరకాయ తొక్కతో చేసిన పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? లేదు అంటే మాత్రం.. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఈ సారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసేయండి.
కావాల్సిన పదార్థాలు..
- 2 బీరకాయలు
- 15 పచ్చిమిరపకాయలు
- ఒక టమాటా
- ఒక టీ స్పూన్ ధనియాలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- ఒక టేబుల్ స్పూన్ నువ్వులు
- అర టీ స్పూన్ పసుపు
- ఉసిరి కాయంత చింతపండు
- రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం..
- ముందుగా బీరకాయ తొడిమలు తీసేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత పైన ఉండే తొక్కను తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి కడాయి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌లో నిధానంగా ఫ్రై చేయండి. ఇందులోనే నువ్వులు వేసి దోరగా వేయించుకోండి.
- ఇవన్నీ చల్లారక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే కడాయిలో నూనె పోసుకుని.. కట్ చేసుకున్న బీరకాయ తొక్కను వేయాలి.
- ఆ తర్వాత పచ్చిమిర్చీ, టమాట ముక్కలు వేసి లో ఫ్లేమ్‌లో నిధానంగా కలుపుతూ 10 నిమిషాల పాటు మగ్గించాలి.
- అనంతరం కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసుకొని నిమిషం పాటు వేగనించి స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌తో ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేయాలి.
- ఇందులోనే చింతపండు, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోని గ్రైండ్ చేసుకోవాలి.
- ఒకవేళ పచ్చడి గట్టిగా వచ్చినట్లు అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. నీరు లేకుండా చేస్తే నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది.
తాళింపు కోసం..
- 3 టేబుల్ స్పూన్ల నూనె
- పచ్చి శనగపప్పు
- మినపప్పు
- జీలకర్ర
- ఆవాలు
- ఎండు మిర్చి
- కరివేపాకు
తాళింపు విధానం..
- ముందుగా కడాయి వేడి చేసుకుని నూనె పోసుకోవాలి.
- ఆ తర్వాత పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి.
- ఇవన్నీ కాస్త వేగాక ముందుగా చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి.
- అంతే అదిరిపోయే బీరకాయ తొక్క పచ్చడి రెడీ! ఇంకేందుకు ఆలస్యం వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తినండి.