krishnashtami Special Sweet Atukula Laddu Recipe: కృష్ణాష్టమి వచ్చేస్తోంది. ఆగస్టు 26 సోమవారం ఈ పండగను జరుపుకోనున్నారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆ గోపాలుడిని పూజిస్తారు. భజనలు చేయడం, ఉట్లు కొట్టడం, ఉపవాసాలు ఉంటూ పండగను ఘనంగా జరుపుకుంటారు. అంతే కాకుండా ఆ కన్నయ్య పుట్టినరోజు నాడు చాలా మంది స్వామి వారికి ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెడతారు. రకరకాల పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ అంటూ తమకు తోచిన విధంగా పెడుతుంటారు. ఇవి మాత్రమే కాదు ఆ నందగోపాలుడికి అటుకులతో చేసిన వంటలన్నా ప్రీతే. అయితే అటుకులతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారికి లడ్డూలను తయారుచేసి పెట్టండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా వెరీ ఈజీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సినవి:
- అటుకులు- 2 కప్పులు
- బెల్లం- కప్పు
- నెయ్యి - అరకప్పు
- బాదం, జీడిపప్పులు - తగినన్నీ
- యాలకులు -4
- పాలు- అరకప్పు
- ఎండు కొబ్బరి- పావుకప్పు
అటుకుల లడ్డూలు తయారీ విధానం :
- ముందుగా అటుకులను జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు కడాయిలో అటుకులు వేసి సన్నని మంట మీద క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుకొబ్బరి, యాలకులు మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత వేయించిన అటుకులు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- కడాయిలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని బాదం, జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
- అదే కడాయిలో బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసుకుని పూర్తిగా కరిగే వరకు సన్నని మంట మీద కలపాలి. బెల్లం కరిగిన తర్వాత పొడి చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
- మధ్యమధ్యలో పాలు యాడ్ చేసుకుంటే కలుపుకోవాలి. పాలు కలుపుకోవడం వల్ల లడ్డూలు మెత్తగా, చాలా రుచికరంగా ఉంటాయి.
- తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేయించిన బాదం, జీడిపప్పులను వేసి కలపండి.
- తర్వాత కొద్దిగా నెయ్యి చల్లి చేతితో లడ్డూలను చేసుకుంటే సరిపోతుంది.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే తక్కువ సమయంలోనే అటుకుల లడ్డూలను చేసుకోవచ్చు.
- నచ్చితే మీరు కూడా ఈ లడ్డూలను ఇంట్లో ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు ? ఆగస్టు 26నా లేదా 27వ తేదీనా? - పండితుల సమాధానమిదే!
స్వీట్ షాప్ స్టైల్లో "బూందీ లడ్డూ" - ఈ టిప్స్‌తో తయారు చేస్తే అమోఘమైన రుచి!
పిల్లలకు నువ్వుల లడ్డు ఇలా చేసి ఇచ్చారంటే - మస్త్ స్ట్రాంగ్‌గా, బలంగా తయారవుతారు!