How to deal with Colleagues derision at Office work : "నేను ఓ కంపెనీలో పనిచేస్తున్నాను. ఉమెన్ టీమ్‌ను లీడ్ చేస్తున్నాను. దాదాపుగా నేను అందరితోనూ బాగానే ఉంటాను. కానీ.. మా టీమ్‌లోని ఒకరు నా వెనకాల విమర్శిస్తున్నట్టు తెలిసింది. ఎగతాళిగా కూడా మాట్లాడుతున్నారట. నేను మాత్రం ఆమె గురించి ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడలేదు. తన గురించి పాజిటివ్‌గానే ఆలోచిస్తా. అలాంటిది.. నా గురించి ఇలా మాట్లాడడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ విషయమై ఆమెను అడగాలా? ఎలా అడగాలి?" అంటూ.. నిపుణుల సలహా కోరుతున్నారు ఓ మహిళ. మరి, ఈ సమస్యకు నిపుణులు ఎలాంటి పరిష్కారం చూపించారో ఇప్పుడు చూద్దాం.
ఈ సమాజంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ఒక్కో విధంగా ఆలోచిస్తారు. వాళ్లు పెరిగిన పరిస్థితులు, నేపథ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఇవన్నీ.. వాళ్ల బిహేవియర్‌ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి.. అందరూ మనలాగే ఆలోచించాలని కోరుకోవడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. మనం పాజిటివ్‌గా ఉన్నంత మాత్రానా.. ఎదుటి వాళ్లు కూడా అలాగే ఉంటారని, ఉండాలని అనుకోకూడదని సూచిస్తున్నారు.
బాధపడాల్సిన అవసరం లేదు..
ఇతరులు మన గురించి మన వెనుక మాట్లాడుకోవడం సర్వ సాధారణం. అలాంటి వారి గురించి, వారు చేసే కామెంట్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అవన్నీ గాల్లో కలిసిపోయే కబుర్లు. అలాంటి మాటలకు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లు అలా మాట్లాడడం వల్ల మీ పని మీద ఏదైనా ప్రభావం పడితే.. లేదంటే మీ గురించి అబద్ధాలు చెబితే.. అవి మీ ప్రతిష్ఠను దెబ్బతీసేలాగా ఉంటే.. అప్పుడు స్పందించాలి తప్ప, మిగిలిన సమయాల్లో అలాంటి గాలి ముచ్చట్ల గురించి పట్టించుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
మనల్ని అందరూ గౌరవిస్తారా?
మనల్ని అందరూ గౌరవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు కూడా ఏమీ లేదు. కానీ.. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. అందరూ మన గురించి పాజిటివ్‌గా ఆలోచించరు. ఏదో ఒక లోపాన్ని ఎత్తిచూపి విమర్శిస్తూనే ఉంటారు. అవన్నీ మన ఎదురుగా మాట్లాడలేక.. ఇతరులతో కలిసి ఉన్నప్పుడు అనేస్తుంటారు. మీ గురించి మీ వెనక మాట్లాడుతున్నారంటే.. మీ ముందు మాట్లాడే ధైర్యం లేదని అర్థం. మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారని అర్థం. అలాంటి వారి మాటలను పట్టించుకోకుండా.. మీ పని మీద దృష్టిపెట్టి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిపోవాలని సూచిస్తున్నారు.
మరీ ఎక్కువైతే ఇలా చేయండి..
మీ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుతుంటే గనక.. నేరుగా వారిని కలిసి మాట్లాడాలని సూచిస్తున్నారు. ఏదైనా విషయం ఉంటే నాతోనే డైరెక్టుగా చెప్పు. అంతే తప్ప, ఎగతాళిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించండి. అవసరమైతే.. మీ ఆఫీసులో పైవాళ్లతో మాట్లాడి, వాళ్ల అభిప్రాయం కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫైనల్లీ.. ఒక టీమ్‌ను లీడ్ చేస్తున్నప్పుడు.. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఆలోచిస్తూ, అతిగా స్పందించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మీ పని మీరు సరిగ్గా చేస్తున్నంత కాలం.. ఇలాంటి సమస్యలేవీ మీపై ప్రభావం చూపలేవని, ఈ విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
"దీని గురించి మీరు ఎందుకింతగా బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. అందరూ మనలాగా ఆలోచిస్తారని, ఆలోచించాలని కోరుకోవద్దు. టీమ్ లీడ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి కామన్. వీటి గురించి ఎక్కువగా స్పందించకండి. మీరు సరిగ్గా పనిచేస్తున్నంత కాలం ఇలాంటివి ఏమీ చేయలేవు. అయితే.. ఆమె అలా మాట్లాడటం వల్ల మీ పని మీద ఏదైనా ప్రభావం పడితే.. ఆమె వ్యాఖ్యలు మీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉంటే.. అప్పుడు స్పందించండి. నేరుగా ఆమెతోనే మాట్లాడండి. ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పమనండి. అయినా సెట్ కాకపోతే.. అప్పుడు పైవాళ్లతో మాట్లాడండి." - కవిత గూడపాటి, సోషల్ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
ఇవి కూడా చదవండి :
నైట్ డ్యూటీ చేసే వారికి షుగర్ వస్తుందా? - నిపుణుల సమాధానం ఇదే!