How to Find Adulteration in Milk : దీపావళి అంటే టపాసులు, కొత్తబట్టలు, దీపాల కాంతులే కాదు.. మిఠాయిల పండగ కూడా. ప్రతి ఇంటా స్వీట్ ఉండాల్సిందే.. ప్రతి నోటా తీపి పండాల్సిందే. అయితే.. ఏ స్వీట్ తయారు చేయాలన్నా పాలు, నెయ్యి, చక్కెర తప్పక కావాల్సిందే. కానీ.. వీటిని అక్రమార్కులు కల్తీ చేస్తూనే ఉన్నారు. ఇలా కల్తీ అయినవి తింటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే.. స్వీట్స్ తయారికీ ఉపయోగించే పాలు, పాల పదార్థాలు, పంచదార వంటి వాటిలో కల్తీని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని చిట్కాలు సూచిస్తోంది. ఈ సూచనల ద్వారా ఇంట్లో స్వయంగా మీరే వాటి కల్తీని కనిపెట్టవచ్చు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పాలు, పాల పదార్థాలు: పాలలో నీళ్లు, డిటర్జెంట్, యూరియా వంటివి కలిపి కల్తీ చేస్తుంటారు. ఈ క్రమంలో పాలలో నీళ్లను, డిటర్జెంట్‌ను గుర్తించేందుకు FSSAI సూచిస్తున్న టిప్స్ ఇవే..
పాలలో డిటర్జెంట్‌ను గుర్తించడం:
- ఒక గ్లాస్ జార్‌లోకి 10ml పాలు, 10 ml నీళ్లను తీసుకోవాలి.
- వాటిని బాగా కలపాలి.
- ఒకవేళ పాలలో డిటర్జెంట్ కలిస్తే చాలా మందంగా నురగ ఏర్పడుతుంది.
- అదే పాలు స్వచ్ఛమైనవైతే పాలపై చాలా పల్చగా నురగ వస్తుంది.
పాలు, పాల పదార్థాల్లో(కోవా, పనీర్) స్టార్చ్ గుర్తించడం:
- ముందుగా ఓ గిన్నెలోకి 3ml పాలు, 5 ml నీళ్లు కలిపి మరిగించాలి.
- చల్లారిన తర్వాత అందులోకి 2 చుక్కల అయోడిన్ కలపాలి.
- పాలు నీలం రంగులోకి మారితే అందులో స్టార్చ్ ఉన్నట్లు.
పాలలో నీళ్లు గుర్తించడం:
- కొన్ని చుక్కల పాలను ఏటవాలుగా ఉండే ప్లేస్‌లో పోయాలి.
- పాలు స్వచ్ఛమైనవి అయితే నెమ్మదిగా జారుతూ.. అక్కడ తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.
- అదే కల్తీ పాలు అయితే నీళ్లు ఫాస్ట్‌గా జారడంతోపాటు ఎలాంటి మరకలూ ఉండవు.
నెయ్యి: స్వీట్స్ తయారికీ నెయ్యి అధికంగా అవసరమంటుంది. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు అందులో ఉడికించిన బంగాళదుంప/స్వీట్ పొటాటో తురుమును కలుపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అది కనుగొనేందుకు..
- ముందుగా ఓ గ్లాస్ బౌల్లోకి అర టీ-స్పూన్ నెయ్యి లేదా వెన్న తీసుకోవాలి.
- అందులో 3 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి.
- నెయ్యి లేదా వెన్న బ్లూ కలర్లోకి మారితే అది కల్తీ జరిగినట్లు.
పంచదార: పంచదారలో చాక్ పౌడర్‌ను గుర్తించేందుకు..
- ముందుగా ఓ గాజు గ్లాస్‌లోకి వాటర్ తీసుకోవాలి.
- అందులోకి 10 గ్రాముల పంచదార పొడి వేయాలి.
- ఒకవేళ అందులో చాక్ పౌడర్ కలిస్తే అది కరిగి గ్లాస్ అడుగున చేరుతుంది. కల్తీ జరగకపోతే నీరు స్వచ్ఛంగా ఉంటుంది.
సిల్వర్ ఫాయిల్: ప్రస్తుతం చాలా మంది స్వీట్స్‌పై సిల్వర్ ఫాయిల్ ప్లేస్ చేస్తుంటారు. అయితే కొందరు వ్యాపారులు సిల్వర్ ఫాయిల్ బదులు అల్యూమినియం వాడుతున్నారు. దానిని గుర్తించేందుకు..
- ముందుగా కొద్ది మొత్తంలో సిల్వర్ ఫాయిల్ తీసుకోవాలి.
- దాన్ని రెండు వేళ్ల మధ్య పెట్టి నలపాలి. ఇలా నలిపినప్పుడు పొడిలాగా మారితే అది సిల్వర్ ఫాయిల్ అన్నట్లు అర్థం. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా పడితే అందులో అల్యూమినియం కలిసినట్లు అని గుర్తుంచుకోవాలి
- మరో విధానం.. ముందుగా కొద్దిగా సిల్వర్ ఫాయిల్ తీసుకుని రౌండ్బాల్గా చేయాలి.
- దాన్ని కాల్చినప్పుడు ప్యూర్ సిల్వర్ ఫాయిల్ అయితే పూర్తిగా కరిగి చిన్న చిన్న బాల్స్‌లాగా కనిపిస్తుంది. అదే అందులో అల్యూమినియం కలిస్తే బూడిద లాగా మారుతుంది.
మార్కెట్ నెయ్యితో కల్తీ భయమా? - పాల మీగడతో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
మీరు ఉపయోగించే "పసుపు" స్వచ్ఛమైనదేనా ? - ఓ సారి ఇలా చెక్ చేసి తెలుసుకోండి!
మార్కెట్లో "కల్తీ టీ పొడి" హల్చల్ - మీరు వాడేది స్వచ్ఛమైనదేనా? ఇలా గుర్తించండి!