Bachelors Cooking Tips : చదువు, ఉద్యోగరీత్యా కొత్తగా సిటీలోకి వచ్చిన బ్యాచిలర్స్ వంట కష్టాలు మామూలుగా ఉండవు. అప్పటి వరకు కిచెన్‌లోకి ఎంటర్ కానీ, వారు పట్టణాల్లో వంట చేసుకుని తినడానికి నానా తంటాలు పడుతుంటారు. రోజూ బయట హోటళ్లలో తినలేక.. కర్రీ పాయింట్లలో కర్రీలు తిని బోర్ కొట్టి.. రూమ్‌లో ఉన్న కూరగాయలతో వారి స్టైల్లో రకరకాల కర్రీస్ ట్రై చేస్తుంటారు. అయితే, ఈ క్రమంలో కొన్నిసార్లు కూరలు మాడిపోతుంటాయి. అలాగే.. ఉప్పు ఎక్కువైపోవడం లేదా తక్కువైపోవడం జరుగుతుంటాయి. దీంతో వాటిని తినలేక చెత్తబుట్టలో పడేస్తుంటారు. అయితే.. రూమ్‌లో ఉండే పదార్థాలతోనే ఘుమఘుమలాడేలా వంటలు ఎలా చేయాలి? కూరలు మాడినప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
పప్పు మాడితే ఇలా చేయండి..
ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు, పెసరపప్పు ఉడకబెట్టినప్పుడు నీళ్లు కప్పుకు రెండు గ్లాసుల నీళ్లను పోసుకోండి. ఈ కొలతతో నీళ్లు వేసుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుంది. ఒకవేళ నీళ్లు తక్కువై పప్పు మాడిపోతే.. గరిటె సాయంతో పైనున్న పప్పు మొత్తం తీసి చల్లార్చండి. తర్వాత పాన్‌లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటాలు వేసి వేపండి. ఇప్పుడు పప్పు వేయండి. ఇందులో కొన్ని నీళ్లు పోసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుంటే అది పప్పు చారు అయిపోతుంది. ఇలా.. పప్పు మాడిపోయిందని టెన్షన్ పడకుండా ఆ పూట తినేయొచ్చు.
ఫ్రై కర్రీస్ ఇలా చేసేద్దాం..
బ్యాచిలర్స్ ఎక్కువగా చికెన్ కర్రీ ఫ్రై చేసుకుని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే.. చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు పీసెస్ మాడకుండా ఉండడానికి పాన్‌లో లైట్‌గా నీళ్లను పోసుకుంటూ ఉండాలి. ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవడం వల్ల చికెన్ బాగా ఉడకడంతోపాటు మాడకుండా ఉంటుంది. మీరు ఈ చిట్కాని బెండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా పాటించవచ్చు.
గ్రేవీ కోసం ఇలా..
కర్రీ ఏది వండినా కూడా కాస్త గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. అయితే.. గ్రేవీ కోసం వాటర్ ఎక్కువగా వేస్తే రెసిపీ రుచి మొత్తం పోతుంది. ఇలాంటప్పుడు.. గ్రేవీ టేస్టీగా ఉండడానికి అందులో కాస్త పెరుగు కలపండి. దీనివల్ల కర్రీ చిక్కగా ఉండడంతోపాటు ఎంతో రుచిగా ఉంటుంది.
ఉప్పు, కారం విషయంలో కాస్త జాగ్రత్త..
ఏ కర్రీ వండినా కూడా తొందరపడి ఉప్పు, కారం ఎక్కువగా వేసుకోండి. మరీ ముఖ్యంగా ఉప్పు ఏ మాత్రం ఎక్కువ వేయకండి. ఒకవేళ తగ్గితే.. కూర ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఎక్కువైతే మాత్రం రెసిపీ మొత్తం చెత్తబుట్టలో పడేయాల్సి వస్తుంది. ఒకవేళ పొరపాటున కారం, ఎక్కువపడితే పెరుగును యాడ్ చేయండి. కాస్త తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి :
అరటి పండ్లు రెండు రోజులకే నల్లగా మారుతున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే వారం రోజులైనా తాజాగా!
స్వీట్ షాప్ స్టైల్ "పల్లీ పకోడి" ఇకపై ఇంట్లోనే - ఈ టిప్స్ పాటిస్తే సూపర్