Benefits of Coconut Milk : నోరూరించే వంటకాల తయారీలోనే కాదు.. ఆరోగ్యానికీ కొబ్బరిపాలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. చర్మ, జుట్టు సంరక్షణలో కూడా కొబ్బరిపాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. అదెలా అనుకుంటున్నారా? అయితే, కొబ్బరి పాలను ఎలా ఉపయోగిస్తే ఏవిధమైన ప్రయోజనాలు సొంతమవుతాయి? ఇంట్లోనే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సహజ మాయిశ్చరైజర్‌గా : కొబ్బరిపాలలో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్, సహజ ప్రొటీన్స్.. ఇలా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పొడిచర్మం సమస్యతో బాధపడుతున్న వారికి కొబ్బరిపాలు చాలా చక్కని పరిష్కారమని చెబుతున్నారు. వీటిని నేరుగా చర్మానికి అప్త్లె చేసి గుండ్రంగా మసాజ్ చేస్తూ 30 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని వాటర్‌తో శుభ్రం చేసేసుకుంటే సరి. మృదువైన, మెత్తని చర్మం సొంతమవుతుందంటున్నారు.
2018లో "Journal of Food Science and Technology"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కొబ్బరిపాలలో ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో రాయిపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
హెల్దీ హెయిర్ గ్రోత్ : జుట్టు సమస్యలను నివారించడంలోనూ కొబ్బరిపాలు(Coconut Milk) చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను తగ్గించి హెల్దీ హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొబ్బరిపాలను స్కాల్ప్, జుట్టుకు స్మూత్‌గా మసాజ్ చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి ఆపై తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందంటున్నారు.
స్కిన్ గ్లో పెంచుతుంది : కొబ్బరిపాలలో ఉండే లారిక్ యాసిడ్, విటమిన్ సి, ఇతర పోషకాలు.. మొటిమలు, నల్లమచ్చలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని కొబ్బరిపాలు తీసుకొని అందులో కొద్దిగా తేనె, పసుపు వేసి సహజమైన ఫేస్ స్క్రబ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని చర్మానికి అప్లై చేసుకుంటే చాలు. మృతకణాలను తొలగించి స్కిన్ ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుందంటున్నారు.
జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది : కొబ్బరిపాలలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉండి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇందుకోసం.. కొబ్బరిపాలను స్మూతీలు, సూప్‌లు లేదా వివిధ వంటకాలలో ఉపయోగించడం ద్వారా మీ డైట్లో భాగం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
మంచి ఇమ్యూనిటీ బూస్టర్ : యాంటీఆక్సిడెంట్లు(National Library of Medicine రిపోర్టు), విటమిన్లు పుష్కలంగా ఉండే కొబ్బరి పాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే.. వీటిలో ఉండే యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడంలో హెల్ప్ చేస్తాయి. ఇందుకోసం డైలీ ఒక గ్లాసు కొబ్బరి పాలను తాగడం లేదా డైలీ వంటలలో యాడ్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.
కొబ్బరి పాలను తయారుచేసుకోండిలా!
ఇందుకోసం మిక్సీ జార్లో 1 కప్పు తురిమిన కొబ్బరి, 2 కప్పుల వేడి నీరు తీసుకొని సుమారు 2-3 నిమిషాల పాటు మిశ్రమం క్రీమీగా మారే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లాత్ లేదా ఫైన్-మెష్ స్ట్రైనర్ ద్వారా ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని శుభ్రమైన, గాలి చొరబడని కంటైనర్‌లోకి తీసుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకొని 3-4 రోజులు వాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
వరల్డ్ కోకోనట్ డే: బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు - కొబ్బరిని ఇలా వాడండి!
కొబ్బరి నూనె జుట్టుకే కాదు - ఈ పనులకూ ఉపయోగపడుతుంది! ఓ సారి ట్రై చేయండి!