Beetroot Rava Laddu Recipe : మనకు శక్తిని, ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి.. బీట్రూట్. అయితే, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసినప్పటికీ కొంత మంది దీనిని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "బీట్రూట్ రవ్వ లడ్డు". సూపర్ టేస్టీగా ఉండే ఈ లడ్డూలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే.. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. పైగా ఈ లడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందట. మరి.. ఆలస్యమెందుకు మీరూ ఓసారి బీట్రూట్ లడ్డూలను ట్రై చేసి ఇంటిల్లిపాది ఆస్వాదించండి. ఇంతకీ.. ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- బీట్రూట్ ముక్కలు - ముప్పావు కప్పు
- పంచదార - ముప్పావు కప్పు
- యాలకులు - 3
- నెయ్యి - పావు కప్పు
- జీడిపప్పు పలుకులు - కొన్ని
- కిస్మిస్ - కొన్ని
- పాలు - 1 టీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బీట్రూట్లను పొట్టు తీసుకొని ముప్పావు కప్పు పరిమాణంలో సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని ఒక పల్చని క్లాత్‌లో పోసుకొని ఒక గిన్నెలోకి మలినాలు లేకుండా రసాన్ని మాత్రమే గట్టిగా పిండుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు మళ్లీ మిక్సీ జార్ తీసుకొని పంచదార, యాలకులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక.. జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి.
- తర్వాత అదే పాన్‌లో బొంబాయి రవ్వ వేసుకొని స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక.. ముందుగా వడకట్టి పెట్టుకున్న అరకప్పు బీట్రూట్ రసాన్ని పోసుకోవాలి. ఆపై లో ఫ్లేమ్ మీద మరో 5 నిమిషాల పాటు మొత్తం కలిసేలా గరిటెతో కలియతిప్పుతూ మిశ్రమాన్ని వేయించుకోవాలి.
- తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని.. ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని అందులో వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమం లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా రాకపోతే 1 టీస్పూన్ పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆపై వేయించుకొని రెడీగా ఉంచుకున్న కిస్మిస్, జీడిపప్పు పలుకులనూ అందులో వేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత చేతులకు కాస్త నెయ్యి అప్లై చేసుకొని కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ నిమ్మకాయంత పరిమాణంలో ఉండలు చుట్టుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన "బీట్రూట్ రవ్వ లడ్డూలు" రెడీ!
ఇవీ చదవండి :
గోళ్లు, జుట్టు సమస్యలకు చెక్ పెట్టే 'మునగాకు లడ్డు'!- మీరు ట్రై చేయండి!
స్వీట్ షాప్ స్టైల్లో "బూందీ లడ్డూ" - ఈ టిప్స్‌తో తయారు చేస్తే అమోఘమైన రుచి!