How to Make Palli Pachadi: కొంతమంది భోజనంలో కూరల కంటే పచ్చళ్లనే ఇష్టంగా తింటుంటారు. అలాంటి వారి కోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. రాయలసీమ స్టైల్ పల్లీ పచ్చడి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కిచెన్‌లో ఉండే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో పదే పది నిమిషాల్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ పచ్చడి ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. ఇక దీన్ని మార్నింగ్ టిఫెన్స్, వేడి వేడి అన్నం, రాగి సంకటి.. ఇలా దేనిలోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంతకీ, ఈ టేస్టీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పల్లీలు - అరకప్పు
- ఆయిల్ - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 10 నుంచి 15
- వెల్లుల్లి రెబ్బలు - 4
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- ఉల్లిపాయ - 1
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచం హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి.
- అవి వేగాక అందులో కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తుంచి వేసుకొని వాటినీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక దించేముందు వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకొని పాన్ దించేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆవిధంగా గ్రైండ్ చేసుకున్నాక.. అందులో నీటితో సహా నానబెట్టుకున్న చింతపండును వేసుకోవడంతో పాటు కొన్ని కాగబెట్టి చల్లార్చుకున్న వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా పచ్చడి త్వరగా పాడవ్వదు. మూడు, నాలుగు రోజులైనా ఫ్రిజ్‌లో పెట్టి వాడుకోవచ్చు.
- ఇక చివరగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నుంచి 3 పల్స్ మాత్రమే ఇచ్చి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అంటే.. ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకుండా తినేటప్పుడు పంటికి తగిలేలా చూసుకోవాలి.
- తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "రాయలసీమ స్టైల్ పల్లీ పచ్చడి" రెడీ!
- ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నేరుగా తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. లేదంటే తాళింపు పెట్టుకొని తినేయొచ్చు.
- అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. మీకు రోలు అందుబాటులో ఉంటే అందులో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న దానికంటే చాలా రుచికరంగా వస్తుంది.
ఇవీ చదవండి :
రొటీన్ కూరలు తిని నోరు చప్పగా తయారైందా? - ఇలా "పచ్చిమిర్చి బండ పచ్చడి" ట్రై చేయండి - చాలా టేస్టీ!
కొంచెం పుల్లగా.. కొంచెం కారంగా - నోరూరించే దోసకాయ మిర్చి పచ్చడి - ఇలా ప్రిపేర్ చేయండి!