Oil Pulling Health Benefits : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా... నోరు ఆరోగ్యంగా ఉటే మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుకు కృషి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకున్న అనంతరం చాలామంది మౌత్‌వాష్‌తో నోరు పుక్కిలిస్తుంటారు. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యానికి, నోటి దుర్వాసనను దూరం చేయడానికి ఈ ప్రక్రియ బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. అయితే, సాధారణంగా మార్కెట్లో దొరికే మౌత్‌వాష్‌లలో ఉండే రసాయనాల గాఢత నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే మన వంటింట్లోనే దొరికే కొన్ని రకాల నూనెలతో నోటిని పుక్కిలించడం వల్ల నోరు శుభ్రపడడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియతో ప్రయోజనాలు : మన నోటిలో వందల కొద్ది సూక్ష్మక్రిములు ఉంటాయట. అందులో కొన్ని హానికరమైనవి సైతం ఉంటాయి. ఆ సూక్ష్మక్రిములు పంటి నొప్పి, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులతో పాటుగా నోటి దుర్వాసనకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియ ఇలాంటి బ్యాక్టీరియాను తొలగించగలదని తాజాగా నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
నోటిని మంచిగా శుభ్రపరచుకోకపోవడంతో నోటి ఇన్ఫెక్షన్లు, చిగుళ్లలో సమస్యల వల్ల నోటి దుర్వాసన రావడం కామన్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే మౌత్‌వాష్‌ల కంటే మన వంటింట్లో లభించే నూనెలే సమర్థంగా పనిచేస్తున్నట్లు మరో పరిశోధనలో వెల్లడైంది.
ప్రతిరోజూ ఆయిల్ పుల్లింగ్ : చక్కెరతో పాటుగా చక్కెరకు సంబంధించిన ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవడం, దంతాల మధ్య చిక్కుకున్న పదార్థాల అవశేషాలను తొలగించుకోకపోవడం వల్ల పళ్లు పుచ్చిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలాంటి సమస్య నుంచి విముక్తి లభించడానికి నిపుణులు సూచించే అద్భుతమైన చిట్కా ఆయిల్ పుల్లింగ్. ప్రతి రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా రంధ్రాలకు కారణమయ్యే బ్యాక్టీరియా నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చిగుళ్ల సమస్యలకు : కొంతమందిలో చిగుళ్లలో వాపు, రక్తస్రావం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు ఆయిల్ పుల్లింగ్‌తో ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. దంతాల మీద పేరుకున్న పాచి, పసుపుదనాన్ని తొలగించడంతో పాటుగా పళ్లను మెరిపించడానికి ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియ వల్ల దవడ, మెడ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుందంటున్నారు. తద్వారా ఆయా భాగాల్లో ఏదైనా నొప్పి ఉంటే తగ్గిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎలా చేయాలి? :
నోరు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేసే ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియను పాటించడానికి కూడా ఓ పద్ధతుందంటున్నారు దంత వైద్య నిపుణులు. ఈక్రమంలో కింద చెప్పిన మూడు చిట్కాల్ని పాటించాలని సూచిస్తున్నారు.
- ఆయిల్ పుల్లింగ్‌కు ఆలివ్, కొబ్బరి, నువ్వుల నూనెలు ఉత్తమ ఎంపిక. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టేబుల్‌స్పూన్ నూనెను నోట్లోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
- ఆపై ఇరవై నిమిషాల పాటుగా మీరు తీసుకున్న నూనె నోట్లోని అన్ని మూలకు వెళ్లేలా పుక్కిలిస్తూ ఉండాలి. ఈ క్రమంలో దీన్ని మింగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. పని పూర్తయ్యాక ఆ నూనెను ఉమ్మివేయాలి.
- ఇక ఈ ప్రక్రియ ముగిసిన తరువాత ఏదైనా తినేముందు లేదా తాగే ముందు నోటిని శుభ్రపరచుకొవాలని, ఆ తర్వాతే ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత సైతం నోటిని శుభ్రపరచుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.